Share News

మా ఊరికి డ్రెయిన్‌, రోడ్డు వేయండి

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:54 AM

కళ్లల్లో ఆనందభాష్పాలు.. గుండె నిండా సంతృప్తి... జీవితకాల కల సాకారమైన వేళ... ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన 86 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ ఆనందంతో..

మా ఊరికి డ్రెయిన్‌, రోడ్డు వేయండి

  • సీఎంను కోరిన సత్యనారాయణ

  • వాటితోపాటు.. సొంతిల్లూ కట్టిస్తా

  • నాలుగు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌కు చంద్రబాబు ఆదేశం

  • అభిమానిని కలిసి సరదాగా మాట్లాడిన ముఖ్యమంత్రి

వాసవీ పెనుగొండ, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): కళ్లల్లో ఆనందభాష్పాలు.. గుండె నిండా సంతృప్తి... జీవితకాల కల సాకారమైన వేళ... ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన 86 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ ఆనందంతో సీఎంను హత్తుకుని పరవశించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంకకు చెందిన సత్యనారాయణ.. సీఎం చంద్రబాబును కలిశారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం సిద్ధాంతం వచ్చిన సీఎం చంద్రబాబు.. ఇచ్చిన మాట ప్రకారం సత్యనారాయణను కలిశారు. తన బస్సులోకి పిలిపించుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ‘ఎన్టీవోడు, పవన్‌ కల్యాణ్‌, మీరు.. ముగ్గురూ త్రిమూర్తులు. బ్రహ్మ.. విష్టు.. మహేశ్వరులు..’ అంటూ సత్యనారాయణ చంద్రబాబుతో అన్నారు.

మీకు ఏమైనా కావాలా..

సత్యనారాయణతో సీఎం 25 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ సందర్భంగా మీకు ఏమైనా కావాలా.. అని ఆయనను అడిగారు. దీంతో ఆ పెద్దాయన ‘మా ఊరిలో డ్రైనేజీ.. రహదారి ఏర్పాటు చేయాలి..’ అని కోరారు. ఊరికోసం చేద్దాంలే కానీ.. ‘మీకు వ్యక్తిగతంగా ఏం కావాలి..?’ అని సీఎం అడిగినప్పుడు.. ‘నా పెద్ద కుమారుడి ఆరోగ్యం కాపాడండి..’ అని విన్నవించుకున్నారు. మీ కోసం ఏమీ వద్దా.. అని మళ్లీ అడగడంతో.. ‘నా పాకకు, చెరువుకు చిన్న దారి ఉంది. దానికి రోడ్డు వేయించండి’ అని సత్యనారాయణ కోరారు. సీఎం జోక్యం చేసుకుని ఇల్లు కట్టుకుంటావా..? అని అడిగితే డబ్బులేదని చెప్పారు. అప్పుడు చంద్రబాబే ఇల్ల్లు కట్టిస్తామని చెప్పారు. నాలుగు నెలల్లో పూర్తి చేయాలని, సత్యనారాయణ అడిగినవన్నీ చేయాలని కలెక్టర్‌ నాగరాణికి సీఎం సూచించారు. సత్యనారాయణ తిరిగి వెళ్లే సమయంలో కూడా చంద్రబాబును ఆలింగనం చేసుకుని దీవించారు. చంద్రబాబును ఇలా కలుస్తానని కలలో కూడా ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 09 , 2026 | 04:54 AM