సీఎం న్యాయం చేస్తామన్నారు
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:03 AM
‘నా బిడ్డ కేసులో న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్షపడేలా చూస్తానని హామీ ఇచ్చారు. నాకు ఆ ఒక్కమాట చాలు.’’ అని గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అన్నారు.
గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వెల్లడి
మా కేసుకు కుల రాజకీయాలు అంటగట్టొద్ద్దు
సాయికృష్ణ మేనమామ నవరంగ్ వినతి
చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబం
వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ‘నా బిడ్డ కేసులో న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్షపడేలా చూస్తానని హామీ ఇచ్చారు. నాకు ఆ ఒక్కమాట చాలు.’’ అని గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అన్నారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి సాయికృష్ణ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎంను కలిసిన సమయంలో విజయలక్ష్మి.. తన కుమారుడి అదృశ్యం వెనుక ఏం జరిగిందన్న దానిపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు. సాయికృష్ణ అదృశ్యం అయినరోజు నుంచి ఏం జరిగిందో ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తానని ీహామీ ఇచ్చారు. అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడారు. తన కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలిగిందన్నారు. సాయికృష్ణ మేనమామ నవరంగ్ మాట్లాడుతూ, పోలీసుస్టేషన్‌లో జరిగిన ఘటనకు కులాలు, రాజకీయాలు అంటగట్టొద్దని విజ్ఞప్తి చేశారు. అనవసర రాజకీయాలకు ఇక్కడితో ముగింపు పలకాలని కోరారు. ‘‘సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మా కేసుపట్ల పూర్తి బాధ్యత తీసుకున్నారు. మాకు అదే చాలు. కేసు విషయంలో ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తుందనే నమ్మకం మాకుంది. క్రిమినల్ కేసు నమోదు చేశారు. తప్పుందని తేలితే ఎవరినీ ఉపేక్షించేది లేదని సీఎం హామీ ఇచ్చారు. మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం.’’ అని ఆయన తెలిపారు.