Share News

కల్తీ నెయ్యిపై రాజకీయం లేదు!

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:41 AM

క్యాబినెట్‌ సమావేశానికి ముందు జరిగిన ఎన్డీయే కూటమి మంత్రుల భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీ ప్రారంభంలోనే తిరుమల కల్తీ లడ్డూ విషయంలో...

కల్తీ నెయ్యిపై రాజకీయం లేదు!

  • అది మన ఎజెండా కూడా కాదు

  • తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యం

  • సూత్రధారులెవరో తేలడం, శిక్ష పడటమే ముఖ్యం: సీఎం

అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): క్యాబినెట్‌ సమావేశానికి ముందు జరిగిన ఎన్డీయే కూటమి మంత్రుల భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీ ప్రారంభంలోనే తిరుమల కల్తీ లడ్డూ విషయంలో ప్రభుత్వం రాజకీయ కోణం చూడటం లేదని, అది మన ఎజెండా కూడా కాదని సహచర మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలు కాపాడి తీరాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు ఎవరనేది తేల్చేందుకు, వారికి సరైన శిక్ష పడేందుకు ప్రయత్నించాల్సిన బాధ్యత ఉందన్న ఆయన, దానికి గాను కమిటీ వేస్తే ఎలా ఉంటుందని సహచర మంత్రుల అభిప్రాయాలను కోరారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని, సూత్రధారులను శిక్షించేందుకు ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా జనసేన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తామూ అదే అభిప్రాయంతో ఉన్నామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. తిరుమలకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందని, ఎంతో పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత.. ప్రాభవం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్‌, పయ్యావుల కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 03:42 AM