వైసీపీ ట్రాప్‌లో పడొద్దు!
ABN , Publish Date - Jul 10 , 2026 | 03:44 AM
‘రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది..
రెచ్చగొడితే రెచ్చిపోవద్దు.. సవాళ్ల జోలికి పోవద్దు
నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారించండి
టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు అధిష్ఠానం ఆదేశం
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది.. కావాలని రెచ్చగొట్టి ట్రాప్‌లోకి లాగుతోంది. ఆ ట్రాప్‌లో పడొద్దు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులపైనే దృష్టి సారించండి’.. అని టీడీపీ అధిష్ఠానం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు హితబోధ చేసింది. ఇటీవలి కాలంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు, వైసీపీ నేతలకు నడుమ ‘చాలెంజ్’ల యుద్ధం నడుస్తోంది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మధ్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వైసీపీ నేత గంగుల బిజేంద్రరెడ్డి నడుమ ఇటీవల తీవ్రస్థాయిలో సవాళ్లు, ప్రతిసవాళ్లు నడిచాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదేబాటలో చాలా మంది టీడీపీ నాయకులు నడుస్తున్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. బుధ, గురువారాల్లో పలువురు ఎమ్మెల్యేలు, నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైసీపీ విమర్శలు, దుష్ప్రచారాలను ఆధారాలతో తిప్పికొట్టాలని, పరస్పరం సవాళ్లు విసురుకునే వరకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తుందని తేల్చిచెప్పారు.