ఫిర్యాదును పిటిషన్‌గా చూడొద్దు
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:56 AM
‘ప్రతి ఫిర్యాదు వెనుక ఒక మానవీయ కథ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని మనం సానుభూతితో స్పందిద్దాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేశారు.
ఓ కుటుంబం ఆశగా చూడండి
మాటల్లో మర్యాద, చర్యల్లో వేగం, నిర్ణయాల్లో మానవత్వం ముఖ్యం
మంత్రులకు సీఎం దిశా నిర్దేశం
అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ‘ప్రతి ఫిర్యాదు వెనుక ఒక మానవీయ కథ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని మనం సానుభూతితో స్పందిద్దాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం మంత్రి మండలి సమావేశం అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆయన మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్)పై సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రతి ఫిర్యాదునూ కేవలం దరఖాస్తుగా చూడొద్దని, దాన్ని ఓ కుటుంబం... పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఆశగా చూడాలని కోరారు. ఒక రైతు ఆవేదన, ఒక విద్యార్థి భవిష్యత్తు, ఒక వృద్ధుని నమ్మకం.. ఇవన్నీ ఫిర్యాదుల రూపంలో వస్తుంటాయని, వాటన్నింటినీ సాధ్యమైనంత వరకు పరిష్కరించే బాధ్యతను తీసుకోవాలని కోరారు. ‘గ్రీవెన్స్ రీడ్రెసల్ అధికారులుగా మన బాధ్యత ఫిర్యాదును పరిష్కరించడం మాత్రమే కాదు. ఫిర్యాదుదారుల బాధను అర్థం చేసుకోవడం.. ఓర్పుగా వినడం.. గౌరవంతో మాట్లాడటం.. హృదయపూర్వకంగా స్పందించడం కూడా’’ అని సీఎం వ్యాఖ్యానించారు. మాటల్లో మర్యాద, చర్యల్లో వేగం, నిర్ణయాల్లో మానవత్వం ఉంటేనే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందన్నారు.
అశాంతిని సృష్టించడమే వారి లక్ష్యం
కుల మతాలను రెచ్చగొట్టడం, తప్పుడు వార్తలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేయడం తద్వారా సమాజంలో అశాంతిని సృష్టించడమే గొడ్డలి పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ నేతలు తమ స్వార్థ రాజకీయాలకు బ్లేడ్ బ్యాచ్‌కి తోడు గంజాయి బ్యాచ్‌లను తయారు చేశారని, వారిని అడ్డం పెట్టుకుని కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఉండాలని, దీనికి తగిన చర్యలు చేపట్టాల్సి ఉందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తల నియంత్రణకు హోంశాఖ, న్యాయశాఖ కలిసి పనిచేయాలన్నది జనసేనాని పవన్ కల్యాణ్ అభిమతమని క్యాబినెట్ దృష్టికి తెచ్చారు. సోషల్ మీడియా దుర్వినియోగం అవుతున్న తీరుపై ఈగల్ టీం అధినేతగా ఉన్న ఆకే రవికృష్ణ మంత్రిమండలికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే, అభ్యంతరకర వ్యాఖ్యలను మాత్రం ఉపేక్షించవద్దని పోలీసు అధికారులను కోరారు. ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలు, అసలు విషయాలు వక్రీకరిస్తే మాత్రం ఉపేక్షించవద్దని సీఎం కూడా స్పష్టం చేశారు. వాట్సాప్ యూజర్ నేమ్ అందుబాటులోకి వస్తే సోషల్ మీడియాను నియంత్రించడం మరింత కష్టమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ట్రాప్‌లో పడొద్దు
వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త పద్ధతి ఎన్నుకున్నారని సీఎం అన్నారు. వారు కావాలని మన ఎమ్మెల్యేలను, నాయకులను రెచ్చగొడుతున్నారని, తద్వారా ప్రజల్లో మన నాయకులను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని మంత్రులకు సూచించారు. కూటమి నాయకులందరికీ ఇది వర్తిస్తుందన్నారు. వైసీపీ వాళ్లు మనల్ని ట్రాప్‌లోకి లాగుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అనంతపురంతోపాటు మిగిలిన జిల్లాల్లో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. విమర్శలను దీటుగా తిప్పికొడుతూనే...అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలన్నారు.
సమన్వయం పెంచుకోండి
ఇన్‌ఛార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇన్‌చార్జి మంత్రులు రెవెన్యూ, ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించాలని కోరారు. ఆయా జిల్లాల్లో ప్రతి అంశంపైనా ఇన్‌చార్జి మంత్రులు దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఇంకా..
నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించేలా సంక్షేమ హాస్టళ్లను తీర్చిదిద్దుదామని మంత్రులకు సీఎం సూచించారు. ప్రైవేటు హాస్టళ్లకు దీటుగా సంక్షేమ హాస్టళ్లను తీర్చిదిద్దే ప్రణాళికలపై మంత్రులతో సీఎం చర్చించారు.
ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ది స్టేట్ నివేదికను ప్రతి నెలా విడుదల చేస్తున్నామని, దీన్ని మంత్రులందరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాలని కోరారు.
ఎప్పటి నుంచో పరిష్కారం కాని భూసమస్యలు ప్రతి జిల్లాలో, నియోజకవర్గాల్లో ఉన్నాయని వాటిని గుర్తించాలని మంత్రులకు సూచించారు. ఆయా జిల్లాల పరిధిలో భూసమస్యలు పరిష్కరించేలా ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని సూచించారు.
జలధార 100 రోజుల కార్యక్రమం బాగా జరిగిందని, అందుకే ఎల్‌నినో ప్రభావం ఉన్నా రాష్ట్రంలో భూగర్భ జలాలు సంతృప్త స్థాయిలో ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లాల వారీగా జలధారపై మంత్రులు సమీక్షించాలని కోరారు. జలధారలో భాగంగా చేస్తున్న చిన్న చిన్న పనులకు జీఎస్టీ మినహాయింపు అడుగుతున్నారని మంత్రులు సీఎం దృష్టికి తీసుకురాగా, దాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
గవర్నమెంట్ లాయర్లు ఎన్ని కేసులు గెలిచారు.. ఎన్ని కేసుల విచారణకు హాజరయ్యారనేది సమీక్ష నిర్వహించాలని న్యాయశాఖ కార్యదర్శిని సీఎం ఆదేశించారు.
ఎల్ నినో ప్రభావంపై రాష్ట్ర ప్రజలందరికీ అవగాహన కల్పించాలని సీఎం కోరారు.