Share News

ఆక్వా రంగాన్ని ఆదుకోండి

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:38 AM

పొగాకు, ఆక్వా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు ముగ్గురు కేంద్ర మంత్రులకు సోమవారం వేర్వేరుగా లేఖలు రాశారు.

ఆక్వా రంగాన్ని ఆదుకోండి

  • సోయాబీన్‌ మీల్‌ దిగుమతికి అనుమతివ్వండి.. ఫిష్‌ మీల్‌ ఎగుమతిని నియంత్రించండి

  • ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతిని ప్రోత్సహించండి

  • ఏరియేటర్లు, ప్రాసెస్‌ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గించాలి

  • కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై వన్‌టైమ్‌ టాప్‌అ్‌పలు ఇవ్వాలి

  • ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు

  • సీఎం లేఖలను కేంద్ర మంత్రులకు అందజేసిన రాష్ట్ర మంత్రులు

అమరావతి, న్యూఢిల్లీ, జూలై 20(ఆంధ్రజ్యోతి): పొగాకు, ఆక్వా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు ముగ్గురు కేంద్ర మంత్రులకు సోమవారం వేర్వేరుగా లేఖలు రాశారు. సోయాబీన్‌ మీల్‌ దిగుమతికి అనుమతివ్వాలని, డీజీఎ్‌ఫటీ ద్వారా ఫిష్‌ మీల్‌ ఎగుమతిని నియంత్రించాలని, ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతిని ప్రోత్సహించాలని, ఏరియేటర్లు, ప్రాసెస్‌ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గించాలని, అమరావతిలో ఎన్‌ఎ్‌ఫడీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను కోరారు. జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్‌ మీల్‌ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌కు లేఖ రాశారు. దేశంలో రొయ్యల మేత కొరత తీర్చేందుకు, ధరల నియంత్రణకు సోయాబీన్‌ మీల్‌ దిగుమతికి అనుమతివ్వాలని కోరారు.


నిర్యాత్‌ ప్రోత్సాహన్‌ పథకాన్ని వర్తింపజేయాలి

ఏపీ నుంచి ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. సమాన వడ్డీ పథకం, నిర్యాత్‌ ప్రోత్సాహన్‌ లాంటి పథకాల కింద ఎఫ్‌సీవీ పొగాకుకు సబ్సిడీ లేకపోవడంతో ఎగుమతిదారులపై భారం పడుతోందని వివరించారు. ప్రాసెస్‌ చేయని పొగాకు రకాలను ఇతర వ్యవసాయ ఉత్పత్తులతోపాటు రోడ్‌ టెప్‌ పథకం కింద ప్రయోజనాలను వర్తింపజేయాలన్నారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేలా ఏరియేటర్లపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై రూ.5లక్ష వరకు వన్‌ టైమ్‌ టాప్‌ అప్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రులకు వినతులు

కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు రాసిన లేఖలను సోమవారం ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు ఆయా శాఖలకు మంత్రులకు అందజేశారు. రాష్ట్రంలో ఆక్వా, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, సామాజిక సంక్షేమ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పలువురు ఎంపీలు ఇక్కడ కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌ను, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ను వేర్వేరుగా కలిసి సీఎం లేఖలను అందజేశారు. ఈ సమావేశాలలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీశ్‌, భరత్‌, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పురందేశ్వరి, బీద మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


బ్లూ ఎకానమీకి సహకరించండి

జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. దీనికోసం అమరావతిలోని నెక్కల్లు గ్రామంలో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించామని తెలిపారు. ఈ ప్రాంతీయ కార్యాలయం బ్లూ ఎకానమీ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఏపీలో ఆక్వా రంగాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు సీఎం లేఖ రాశారు. దేశంలో ఫిష్‌మీల్‌ లభ్యతను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీఎం సోయాబీన్‌ మీల్‌ దిగుమతికి అనుమతివ్వాలన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 05:40 AM