Share News

ఆదివాసీ గిరులు.. అవకాశాల గనులు

ABN , Publish Date - Aug 10 , 2026 | 02:53 AM

గిరిజనులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కారని.. వారంతా అభివృద్ధి భాగస్వాములని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివాసీ ప్రాంతాలు వెనకబడినవి కావని, అపారమైన అవకాశాలు ఉన్న ప్రదేశాలని తెలిపారు.

ఆదివాసీ గిరులు.. అవకాశాల గనులు

  • గిరిజనులు లబ్ధిదారులు కాదు.. అభివృద్ధి భాగస్వాములు

  • పాడేరు, అరకు, లంబసింగి.. కశ్మీరు కంటే బాగుంటాయ్‌

  • మన మన్యంలోనూ కుంకుమ పువ్వు, అవకాడో సాగు

  • ప్రతి ఆదివాసీ కుటుంబానికి పక్కా ఇల్లు.. ప్రతి ఇంటికీ కుళాయి

  • వారి సంక్షేమానికి 4,764 కోట్లు

  • వెయ్యి కోట్లతో అడవితల్లికి బాటలు

  • డోలీ మోతలు లేకుండా ఫీడర్‌ అంబులెన్స్‌లు

  • రాష్ట్రంలో గిరిజనులకు 3 జిల్లాలు,9 ఐటీడీఏలు, కార్పొరేషన్‌

  • వీటన్నిటినీ అనుసంధానిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు

  • బెజవాడ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో సీఎం ఉద్ఘాటన

  • గిరిపుత్రుల అభివృద్ధికి 19 సంస్థలతో ఎంవోయూలు

  • చదువు.. జీవితాలను మార్చడంతో పాటు సమాజంలో విలువను పెంచుతుంది. దేశాభివృద్ధికి మానవ వనరులు అభివృద్ధి చెందాలి. ఈ అభివృద్ధి గిరిజనుల నుంచి ప్రారంభం కావాలి.

  • దేశానికి 15వ రాష్ట్రపతిగా తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ఉన్నారు. ఈ సమయంలోనే 80వ స్వాతం త్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆమె జీవితం ఆదివాసీలకు ఆదర్శనీయం.

- సీఎం చంద్రబాబు

విజయవాడ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): గిరిజనులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కారని.. వారంతా అభివృద్ధి భాగస్వాములని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివాసీ ప్రాంతాలు వెనకబడినవి కావని, అపారమైన అవకాశాలు ఉన్న ప్రదేశాలని తెలిపారు. విజయవాడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవానికి సీఎం హాజరయ్యారు. ఆయనకు గిరిజన మహిళలు, విద్యార్థులు థింసా నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. గిరిజనులు ప్రకృతిని దేవతగా, అడవిని అమ్మగా ఆరాధించి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని కొనియాడారు. వారు స్వచ్ఛమైన మనుషులని.. వారికి చేయూతనిచ్చి, చైతన్యం తీసుకురావాలని పిలుపిచ్చారు. రాష్ట్రంలోని 27.39 లక్షల మంది గిరిజన జనాభా సంక్షేమం కోసం ఈ ఏడాది రూ.4,764 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ‘ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే గిరిజనులను అభివృద్ధిలోకి తీసుకురావడం కష్టం కాదు. గిరిజన ప్రాంతాలకు అనుసంధానం పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 2,036 గిరిజన ఆవాసాలకు రహదారులను అనుసంధానించాం. ప్రతి ఆదివాసీ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మిస్తాం.


గిరిజనుల ఇళ్లపై సోలార్‌ పలకలను ఏర్పాటు చేస్తాం. రూ.1,000 కోట్లతో అడవితల్లికి బాటలు వేస్తున్నాం. 2027 డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీటిని అందిస్తాం. డోలీ మోతలు లేకుండా ఫీడర్‌ అంబులెన్స్‌లు, 108, 104 అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నాం. మారుమూల గ్రామాల్లో సెల్‌సిగ్నల్స్‌ ఉండేలా టెలికమ్యూనికేషన్స్‌తో ఎంవోయూ చేసుకున్నాం. దేశంలో ఎక్కడా గిరిజనుల కోసం మూడు జిల్లాలు లేవు. తొమ్మిది ఐటీడీఏ సెంటర్లు, గిరిజన కార్పొరేషన్‌ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ అనుసంధానిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు’ అని స్పష్టంచేశారు. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను, కీర్తిని తెలియజేసేలా భోగాపురం విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టామన్నారు. థింసా మొన్నటి వరకు నృత్యం మాత్రమేనని.. ఇప్పుడు గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కిందని తెలిపారు. గిరిజనులు ఒకప్పుడు పోడు వ్యవసాయం చేసేవారని, ఇప్పుడది ఆగిందన్నారు. ఈ సందర్భంగా గిరిపుత్రుల అభివృద్ధికి 19 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..


గిరిజన విద్యార్థులకు 650 కోట్లు

రాష్ట్రంలో 4.92 లక్షల మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. తల్లికి వందనం పథకం కింద వారికి రూ.650 కోట్లు అందజేశాం. ఒకప్పుడు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే వాళ్లంతా కూటమి ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ గేర్‌లో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఐఐటీ ఆలిండియా పరీక్షలు పెడితే మొదటిసారి 21 మంది గిరిజన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆ అనుభవంతో విశాఖపట్నం మేకవానిపాలెంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుచేసి 600 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. వారిలో కనీసం 100 మంది విద్యార్థులు ఆలిండియా పరీక్షల్లో ఉత్తీర్ణులై చరిత్ర సృష్టించాలి. ఆదివాసీ విద్యార్థులను ఏఐ వరకు తీసుకెళ్లడానికి చెన్నై ఐఐటీతో ఎంవోయూ కుదుర్చుకున్నాం. త్వరలోనే గిరిజనులకు ఇంటి వద్దే వైద్యం చేయిస్తాం. గిరిజన ప్రాంతాల్లో ఉంటున్నవారిలో ఎనీమియా ఎక్కువగా ఉంది. ఈ లోపాన్ని త్వరలో నివారిస్తాం. బాధితులకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తున్నాం. గిరిజన ప్రాంతాల నుంచి ప్రకృతి సహజసిద్ధమైన ఉత్పత్తులకు బెస్ట్‌ బ్రాండ్‌ను తీసుకొస్తాం. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బరు, పార్వతీపురం పైనాపిల్‌, తేనె, తాటిబెల్లానికి ప్రపంచ గుర్తింపు, బ్రాండింగ్‌ తీసుకొస్తాం. చక్కెర తినే రోజులు పోతున్నాయి. తాటిబెల్లమే కదా అనుకోవద్దు. అది ఆరోగ్యానికి మంచిది. కాఫీ, టీ తాగాలంటే తాటిబెల్లం వేసుకునే రోజులు వస్తాయి. గిరిజనులకు సహకరించే అందరినీ దేశం నలుమూలల నుంచీ రప్పించి ఎంవోయూలు చేసుకున్నాం. మన్యం ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఆదివాసీ ఇల్లు ఓ అతిథి గృహం కావాలి. మన్యంలో సుందర ప్రాంతాలు ఉన్నాయి. పాడేరు, అరకు, లంబసింగి.. కశ్మీరు కంటే బాగుంటాయి. కుంకుమపువ్వు, ఆవకాడో పంటలు కశ్మీరులోనే కాదు.. మన మన్యంలోనూ సాగవుతాయి.


కాఫీ తోటల సాగు మొదలుపెట్టించా..

పాతికేళ్ల కిందట నేనే కాఫీ తోటల సాగును మొదలు పెట్టించాను. దానికి అరకు కాఫీ అని పేరు పెట్టాం. దానిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి నాంది ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. ప్రధాని మన్‌కీబాత్‌లో అరకు కాఫీ గురించి చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశ ప్రధానికి అరకు కాఫీ పొడిని బహుమతిగా ఇచ్చారు. నన్ను కలవడానికి వచ్చిన వాళ్లందరికీ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా.. అరకు కాఫీ మాత్రం కచ్చితంగా ఇస్తాను. దీనిని బెస్ట్‌ బ్రాండ్‌గా తయారు చేస్తాం. గిరిజన ఉత్పత్తులకు విలువను జోడించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మైదాన ప్రాంతాల కంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ ఆదాయం రావడం ఆనందదాయకం.

జగన్‌ సరిగా స్పందించలేదు..

స్థానిక గిరిజనులకే ఉద్యోగావకాశాలు ఉండాలని నాడు ఎన్టీఆర్‌ భావించారు. దీనికి నేను 2003లో జీవో నంబర్‌ 3 జారీచేశాను. 20 ఏళ్లు అమల్లో ఉన్న ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టివేస్తే అప్పుడు సీఎంగా ఉన్న జగన్‌ సరిగా స్పందించలేదు. ఫలితంగా గిరిజనులు.. ఉన్న హక్కును కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఈ సమస్య నా వద్దకు వచ్చింది. దీనిని సరిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రతి మనిషికీ విజన్‌ ఉండాలి. నేటికీ నేను విద్యార్థినే. కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటా. చంద్రబాబు అను నేను.. మీ జీవితాలను మార్చగలిగితే అదే నాకు ఎనర్జీ.. ఎంతో తృప్తి. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు నాలుగో సారి సీఎంగా ఉన్నాను. ఇప్పటి వరకు గంట సెలవు తీసుకోలేదు. ఆ శక్తే నేను తీసుకునే కొత్తకొత్త విధానాలకు నాంది పలుకుతోంది.

Updated Date - Aug 10 , 2026 | 03:02 AM