కుట్రలు, బూతులు, హింస!
ABN , Publish Date - Jul 06 , 2026 | 04:37 AM
‘గొడ్డలి పార్టీ నేతలు ప్రత్యేకంగా ఫండింగ్ చేసి మరీ కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ప్రభుత్వాన్ని, నాయకులను తిట్టిస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
వైసీపీ నమ్ముకున్నది వీటినే.. ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఫండింగ్
నన్ను, పవన్‌ను దూషించేందుకు సోషల్ మీడియాకు నిధులు
కంపెనీల తరిమివేతే వారి పని
ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధిని అడ్డుకోలేరు
క్వాంటమ్, సెమీకండక్టర్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు
కుప్పంలో చంద్రబాబు వెల్లడి
టీడీపీ నేతలు, శ్రేణులతోనూ భేటీ
స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం
2029లో గతం కంటే మెజారిటీలు పెరగాలి: సీఎం
సొంత నియోజకవర్గంలో ముగిసిన మూడ్రోజుల పర్యటన
కంపెనీలను తరిమేయడం, పరిశ్రమలను పారిపోయేలా చేయడమే వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు కేంద్రంగా మార్చేశారు. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసి, ఇప్పుడు సిగ్గు లేకుండా నీతులు చెబుతున్నారు.
రాష్ట్రంలో క్వాంటమ్, సెమీ కండక్టర్ల విభాగాల్లో భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
- సీఎం చంద్రబాబు
కుప్పం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ‘గొడ్డలి పార్టీ నేతలు ప్రత్యేకంగా ఫండింగ్ చేసి మరీ కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ప్రభుత్వాన్ని, నాయకులను తిట్టిస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆదివారం మూడో(చివరి) రోజు ఆయన కడపల్లెలోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. టీడీపీ శ్రేణులతోనూ సమావేశమయ్యారు. ‘నాతో పాటు పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసేందుకు కొన్ని సోషల్ మీడియా గ్రూపులకు పెద్దఎత్తున నిధులు ఇస్తున్నారు. హింస, బూతులనే గొడ్డలి పార్టీ నమ్ముకుంది. ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోలేరు’ అని తేల్చిచెప్పారు. ‘ఇంధన రంగంలో సౌర, పవన విద్యుదుత్పత్తితో పాటు ఇతర అత్యత్తమ విద్యుత్ సరఫరా విధానాలను అందుబాటులోకి తెస్తున్నాం.
దేశంలోనే ప్రముఖ స్టీల్ పరిశ్రమలైన ఆర్సెలార్ మిట్టల్, జిందాల్ సౌత్‌వె్‌స్ట (జేఎస్‌డబ్ల్యూ) కంపెనీలు రాష్ట్రంలో ఉక్కు కర్మాగారాలను నిర్మిస్తున్నాయి. పరిశ్రమలకే కాకుండా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనానికీ ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని తెలిపారు. గత పాలకులు కంపెనీలకు భూములిచ్చి వివాదాలు సృష్టించారని ఆరోపించారు. ఒడిసాలో ఖనిజ సంపదతో ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తే.. ఏపీలో కేవలం ఒకే ఒక్క వ్యక్తి లబ్ధి కోసం విలువైన భూములు, ఖనిజ సంపదను బ్లాక్ చేశారని ధ్వజమెత్తారు. ఆన్‌రాక్ సహా పలు సంస్థలు ఇబ్బందుల్లో పడ్డాయని చెప్పారు.
చెడ్డపేరు తెచ్చుకోవద్దు..
‘త్వరలో రానున్న మున్సిపల్ సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమే గెలువబోతోంది. 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతాం. గతానికంటే మెజారిటీలు పెరిగేలా కృషి చేయాలి. కార్యకర్తల ఆర్థిక సాధికారతకు పార్టీపరంగా కృషి చేస్తున్నాం. చెడ్డపేరు తెచ్చుకునేలా ఎవరూ వ్యవహరించకూడదు. పనితీరు ఆధారంగా పదవులు దక్కుతాయి. ఎలాంటి మొహమాటాలూ ఉండవు. పార్టీ కోసం పనిచేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలి. పార్టీ సూచనలకు అనుగుణంగా ఈ ప్రక్రియను చేపట్టాలి’ అని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. 2019-24 కాలం రాష్ట్రానికి ఓ పీడకల లాంటిదన్నారు. గొడ్డలి పార్టీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పేదల పక్షాన నిలిచే టీడీపీ నేతలు, కార్యకర్తలకు అధికారులు, పోలీసులు కూడా సహకరించాల్సిందేనని సీఎం స్పష్టంచేశారు. ‘పై స్థాయిలోనే కాదు, క్షేత్రస్థాయిలో కూడా పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి. సమస్యల పరిష్కారంలో పోలీసులు, అధికారులతో పార్టీ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలి. క్షేత్ర స్థాయి వాస్తవాలను ప్రభుత్వ, పోలీసు అధికారులకు వివరించి సమస్యలు పరిష్కరించేలా చూడాలి. పథకాల అమలులో ఇబ్బందులు, జాప్యం చోటుచేసుకుంటే.. సరిచేసే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలి’ అని సూచించారు.
రైతుల కోసం ఐటీసీతో ఒప్పందం
కుప్పం రైతులకు ప్రయోజనం కలిగేలా ఐటీసీ సంస్థతో కడా (కుప్పం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ) ఒప్పందం కుదుర్చుకుంది. పండ్లు, కూరగాయాల క్లస్టర్ల ద్వారా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు ఉత్పత్తులు మార్కెటింగ్ చేసేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. అధునాతన వ్యవసాయ విధానాలు అనుసరించేలా కడాతో విశాలాక్షి ఇన్నోవేషన్స్ సస్టెయినబుల్ వాల్యూ చైన్ సంస్థ ఒప్పందం చేసుకుంది.
పర్యావరణ నియంత్రిత పౌల్ట్రీ ఫాం..
సీఎం కడపల్లెలో పర్యావరణ నియంత్రిత పౌలీ్ట్ర ఫాంను ఆదివారం ప్రారంభించారు. ఆధునిక కోళ్ల పెంపకానికి సంబంధించిన ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్ పౌల్ర్టీ షెడ్‌ను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఉష్ణోగ్రత, తేమ, గాలి, వెలుతురు.. అన్నింటినీ సాంకేతికత ద్వారా నియంత్రించి కోళ్లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించవచ్చని వారు వివరించారు. దీంతో గుడ్లు, మాంసం ఉత్పత్తి పెరగడంతో పాటు కోళ్లు చనిపోవడం తగ్గుతుందని తెలిపారు.
ప్రపంచానికి ఆదర్శంగా పీ-4
పీ-4 మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో చంద్రబాబు సమావేశమయ్యారు. సంపద సృష్టి, ఆర్థిక అసమానతల తొలగింపు, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాల కల్పనే పీ-4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. దీనిని ఆదర్శ కార్యక్రమంగా ప్రపంచానికి అందిస్తామన్నారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించగా.. 1.10 లక్షల మంది మార్గదర్శులు ఆదుకోవడానికి ముందుకొచ్చారు. కుప్పంలో 9 వేల కుటుంబాలను అదానీ, టీవీఎస్, మేఘా సంస్థలకు అప్పగించాం. జీవన ప్రమాణాలు మారిన కొన్ని బంగారు కుటుంబాల విజయగాధలను రాష్ట్ర ప్రజలందరికీ చేరవేస్తాం’ అని తెలిపారు.