ఉపాధిని అడ్డుకోవడమే గొడ్డలి పార్టీ లక్ష్యం
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:15 AM
రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే.. గొడ్డలి పార్టీ మాత్రం దానిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.
అందుకే డీఎస్సీపై దుష్ప్రచారం
యువత ఉద్యోగాలు సాధించడం ఆ పార్టీకి ఇష్టం లేదు
కోర్టుల్లో వందల పిటిషన్లు వేశారు
పీపీపీలో ప్రాజెక్టులు వద్దంటారు
భోగాపురం ఆ పద్ధతిలోనే కట్టాం
మరి దాని క్రెడిట్ తమదని ఎలా అంటారు?
అడవి పందుల్లా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు
గాడిన పెట్టడానికి ఎన్నడూ పడనంతగా కష్టపడ్డా
క్రెడిట్ చోరీ ఎవరిదో త్వరలోనే చెబుతా: సీఎం
జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గతంలో ఎన్నడూ లేనంతగా ధ్వంసం చేసింది. మా ఊరిలో అడవి పందులు ఉండేవి. అవి పంటను తిన్నంత తిని మిగిలిన పంటను పూర్తిగా నాశనం చేసి పోయేవి. జగన్ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించింది.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే.. గొడ్డలి పార్టీ మాత్రం దానిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. అందులో భాగంగానే మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో వందలాది పిటిషన్లు వేసిందని ధ్వజమెత్తారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ రెండేళ్ల పనితీరుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర యువత ఉద్యోగాలు సాధించి మంచి జీవితం గడపడం గొడ్డలి పార్టీకి ఇష్టం లేదని, అందుకే అత్యంత పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీపై తొలి నుంచి దుష్ప్రచారం చేస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉందని విమర్శించారు. కొందరు పీపీపీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆ పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టవద్దని ప్రచారం చేస్తున్నారని, కానీ భోగాపురం ఎయిర్‌పోర్టు మాత్రం తమ హయాంలోనే నిర్మించామంటారని పరోక్షంగా జగన్‌ను ఎద్దేవాచేశారు. ఆ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలోనే నిర్మించారన్న విషయాన్ని విస్మరిస్తారని అన్నారు. ‘రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే పీపీపీ వద్దంటారు.. మరి అలాంటప్పుడు భోగాపురం క్రెడిట్ వాళ్లదెలా అవుతుంది? మంచి జరిగితే తమదే క్రెడిట్ అంటారు. లేకుంటే ప్రభుత్వంపై బురదజల్లుతారు.
ఇటువంటి నేతల గురించి ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రంలో క్రెడిట్ చోరీ ఎవరిదో త్వరలో వివరంగా చెబుతా’ అని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తాను జీవితంలో ఎప్పుడూ పడనంత కష్టం పడ్డానన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో సంక్షేమ హామీలు ఇచ్చామని.. అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితి చూసి ఆ హామీలు అమలు చేయగలమా అనిపించిందని చెప్పారు. అందుకే ముందు ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నామని, ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి జరిగితేనే ఆదాయం వస్తుందని, అందుకే అభివృద్ధి కార్యక్రమాలపైనా దృష్టి పెట్టామన్నారు.
ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటారు..
రాజధాని అమరావతిలో రూ.వేల కోట్ల పనులు జరుగుతున్నాయని.. వైసీపీ మాత్రం తాము మళ్లీ వస్తే అమరావతిని రాజధానిగా గుర్తించబోమని అంటోందని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనికి సీఎం స్పందిస్తూ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారు అన్నీ అర్థం చేసుకుంటారని చెప్పారు. జనచైతన్యమే అడ్డగోలు నేతలకు గుణపాఠం కావాలన్నారు.