Share News

నేడు అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:26 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి భువనేశ్వరి అన్నక్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందజేశారు.

నేడు అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

  • ఉదయం అల్పాహారం సహా మూడుపూటలా ఉచితమే

  • చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి రూ.76 లక్షల విరాళం

  • అభినందించిన సీఎం చంద్రబాబు.. దాతలు ముందుకు రావాలని పిలుపు

అమరావతి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి భువనేశ్వరి అన్నక్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 269 అన్న క్యాంటీన్లలో భోజనానికి అయ్యే ఖర్చు కూడా అంతే మొత్తంలో ఉంటుంది. ఈమేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో రూ.76 లక్షల చెక్కును సీఎం చంద్రబాబు సమక్షంలో ఆదివారం అన్న క్యాంటీన్ల సీఈవోకు భువనేశ్వరి అందజేశారు. ఆ మొత్తంతో సోమవారం అన్ని అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారంతోపాటు, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందజేస్తారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకుని పేదలకు కడుపు నింపే అన్నక్యాంటీన్లకు విరాళం ఇవ్వడం ఎంతో సంతృప్తినిస్తోందని, అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఇంతకన్నా మంచి బహుమానం ఏముంటుందని భువనేశ్వరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఉదయం విజయవాడ పటమట రైతు బజార్‌ పక్కనున్న అన్న క్యాంటీన్‌ను సందర్శించి, అల్పాహారం స్వీకరించనున్నారు.


అన్నం పెట్టే అమ్మలా అన్న క్యాంటీన్‌: భువనేశ్వరి

భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని, లక్షల మంది కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రూ.5కే పరిశుభ్రమైన వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందన్నారు. రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్లకు ఆర్థికంగా చేయూతనిచ్చి మరింత మందికి స్ఫూర్తినింపేందుకు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు భువనేశ్వరి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది మీ పుట్టిన రోజుకు అన్నక్యాంటీన్లకు ఇచ్చే విరాళమే మేము మీకు ఇచ్చే బహుమానం అని ఆమె వ్యాఖ్యానించారు.


అన్నదానానికి ముందుకు రండి: చంద్రబాబు

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తన పుట్టిన రోజు సందర్భంగా అన్నక్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరిని అభినందించారు. రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకెళుతున్నామని, తిరుమలలో భక్తుల సహకారంతో నాలుగు దశాబ్దాలుగా అన్నదానం జరుగుతోందని తెలిపారు. పేదలకు రూ.5లకే కడుపు నింపే అన్న క్యాంటీన్లు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు సహా తమకు నచ్చిన రోజు భోజనాలకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. ఇదొక స్ఫూర్తిదాయక కార్యక్రమంగా మారి బ్రాండ్‌ను సృషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 20 , 2026 | 03:27 AM