Manyam Nature: మన్యం అందానికి మైమరచిన సీఎం
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:19 AM
మన్యంలో గురువారం వివిధ ప్రాంతాల్లో భానోదయ దృశ్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబును అమితంగా ఆకర్షించాయి.
పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా), జనవరి 1(ఆంధ్రజ్యోతి): మన్యంలో గురువారం వివిధ ప్రాంతాల్లో భానోదయ దృశ్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబును అమితంగా ఆకర్షించాయి. శీతాకాలం కావడంతో పొగమంచును చీల్చుకుంటూ సువర్ణ వర్ణంలో భానుడి దర్శనం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నూతన సంవత్సరం తొలిరోజున గురువారం ఉదయం ఏజెన్సీలో వంజంగి హిల్స్, మాడగడ, చెరువులవేనం ప్రాంతాల్లోని సన్‌రైజ్ పాయింట్లలో సూర్యోదయం ప్రకృతి ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. వంజంగి హిల్స్‌లోని ఆ దృశ్యం వీడియోను సీఎం ‘ఎక్స్’ వేదికగా పోస్టుచేశారు. రాష్ట్రాన్ని ‘సన్‌రైజ్ స్టేట్’గా పేర్కొంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘సూర్యోదయ రాష్ట్రం నుంచి 2026 తొలి సూర్యోదయం (ఫస్ట్ సన్‌రైజ్ ఆఫ్ 2026.. ఫ్రమ్ ద సన్ రైజ్ స్టేట్.. అరకులోయ, ఆంధ్రప్రదేశ్)’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది.