Share News

CM Chandrababu Davos Tour: రేపు దావోస్‌‌కు చంద్రబాబు

ABN , Publish Date - Jan 18 , 2026 | 05:31 AM

ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సోమవారం దావో్‌సకు వెళ్లనున్నారు.

CM Chandrababu Davos Tour: రేపు దావోస్‌‌కు చంద్రబాబు
CM Chandrababu Naidu

  • ప్రపంచ ఆర్థిక సదస్సులోదిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు

  • ఐబీఎం, గూగుల్‌ క్లౌడ్‌, ఏపీ మోలర్‌ మేర్క్స్‌ సంస్థల సీఈవోలతో చర్చలు

  • స్విట్జర్లాండ్‌, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు

  • తొలిరోజు 20 దేశాల ఎన్నార్టీలతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం

  • 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం

అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సోమవారం దావో్‌సకు వెళ్లనున్నారు. వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు, కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం తెల్లవారుజామున 1.45 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి జ్యూరిక్‌ చేరుకుంటారు.

తొలిరోజు పర్యటన ఇలా..

తొలిరోజు సీఎంతో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్‌ కుమార్‌ భేటీ అవుతారు. ఎరోస్‌ ఇన్నోవేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ కిషోర్‌ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్‌ సింగ్‌ కూడా సీఎంతో సమావేశమవుతారు. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో హిల్టన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. 20 దేశాల నుంచి వచ్చే ఎన్నార్టీలతో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అనంతరం జ్యూరిక్‌ నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌ వెళ్తారు. దావోస్‌లో యూఏఈ ఆర్థిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మర్రితో జరిగే సమావేశంలో పాల్గొంటారు. టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌తో సీఎంతోపాటు ఐటీ మంత్రి లోకేశ్‌ భేటీ అవుతారు. సీఐఐ డీజీ చంద్రజిత్‌ కూడా సీఎంతో సమావేశమవుతారు. మీడియా సంస్థ ‘పొలిటికో’కు సీఎం ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.


రెండో రోజు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు..

రెండో రోజు పర్యటనలో ‘ఇండియా ఎట్‌ సెంటర్‌ జియోగ్రఫీ గ్రోత్‌-ఏపీ అడ్వాంటేజ్‌’ పేరిట సీఐఐ నిర్వహిస్తున్న సెషన్‌లో సీఎం పాల్గొంటారు. అనంతరం ఇండియా లాంజ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తర్వాత దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్‌ సీఈవో అరవిద్‌ కృష్ణతో సీఎం, లోకేశ్‌ సమావేశమవుతారు. గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌తోనూ భేటీ అవుతారు. అనంతరం ఏపీ లాంజ్‌లో నిర్వహించనున్న వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ప్యానల్‌ డిస్కషన్‌కు సీఎం హాజరవుతారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్‌బీసీ ఇంటర్నేషనల్‌కు సీఎం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. దావోస్‌ కాంగ్రెస్‌ సెంటర్‌లో వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ డారెన్‌ టాంక్‌తో సమావేశమవుతారు. ప్రపంచ ఆర్థిక సదస్సు సెషన్‌లో ‘ఎనర్జీ ట్రాన్సిషన్‌ లీడర్స్‌’ సమావేశంలోనూ పాల్గొంటారు. స్విట్లర్లాండ్‌ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్‌ హెలెన్‌ బడ్లిజెర్‌ అర్టెడాతో చర్చలు జరుపుతారు. అనంతరం ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మండ్‌తో భేటీ అవుతారు. ఇజ్రాయెల్‌ మంత్రి నిర్‌ బర్కత్‌, ఆ దేశ ట్రేడ్‌ కమిషనర్‌ రోయ్‌ ఫిషర్‌తోనూ సీఎం చర్చలు జరుపుతారు. సాయంత్రం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ ఎండీ సజ్జన్‌ జిందాల్‌, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్‌, పెయింట్స్‌ సంస్థల ఎండీ పార్ధ్‌ జిందాల్‌తో సీఎం భేటీ అవుతారు. అంతర్జాతీయ కంటైనర్‌ లాజిస్టిక్స్‌ సంస్థ మోలర్‌ మేర్క్స్‌, సీఈవో విన్సెంట్‌ క్లెర్క్‌లతో ముఖాముఖి సమావేశమవుతారు. ఈ రెండు సమావేశాలకు లోకేశ్‌ కూడా హాజరవుతారు. జాన్‌ కాక్రిల్‌ సంస్థ సీఈవో మారాంగేతో సీఎం భేటీ అవుతారు. ‘విజన్‌ టు వెలాసిటీ-డెప్లాయింగ్‌ ఇన్నోవేషన్‌ ఎట్‌ స్కేల్‌’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారు.


మూడో రోజు వరుస సమావేశాలు..

మూడో రోజు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్‌లో సీఎం పాల్గొంటారు. హొరైసిస్‌ చైర్మన్‌ ఫ్రాంక్‌ రిచర్‌తో భేటీ కానున్నారు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్‌ సృష్టి శిబులాల్‌, ఆ సంస్థ సీఓఓ కుష్బు అవస్థి, కాలిబో ఏఐ అకాడమీ సీఈవో రాజ్‌ వట్టికూటి, స్కాట్‌ శాండ్స్చెఫర్‌తో సీఎం సమావేశమవుతారు. బ్లూమ్‌బర్గ్‌ సంస్థ నిర్వహించనున్న ‘ట్రిలియన్స్‌ ఆఫ్‌ డాలర్స్‌ ఏఐ మూమెంట్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ గ్లోబల్‌ ఎకానమీ’ సెషన్‌లో సీఎం ముఖ్యవక్తగా ప్రసంగిస్తారు. ఏపీ లాంజ్‌లో నిర్వహించే బిల్డింగ్‌ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం పాల్గొంటారు. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్‌ రీజెనరేషన్‌ మొబిలైజింగ్‌ కేపిటల్‌ పేరుతో నిర్వహించే మరో కార్యక్రమంలోనూ పాల్గొంటారు. మొత్తంగా దావో్‌సలో 36 కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే మూడు సమావేశాల్లో, పారిశ్రామికవేత్తలతో జరిగే 16 వన్‌ టు వన్‌ సమావేశాల్లో పాల్గొంటారు. వీటితోపాటు 9 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్‌లో పాల్గొంటారు. ఈ నెల 22న దావోస్‌ నుంచి జ్యూరిక్‌ చేరుకుని అక్కడి నుంచి బయల్దేరి 23వ తేదీ ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.

నేడు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు

ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయంలో నిర్వహించే ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, పార్టీ నేతలతో సమావేశమవుతారు. సుమారు రెండున్నర గంటలపాటు కార్యాలయంలోనే గడిపిన అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు ఉండవల్లిని నివాసానికి బయలుదేరి వెళ్తారు.

Updated Date - Jan 18 , 2026 | 08:00 AM