డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం’ బ్రాండింగ్!
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:11 AM
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం ‘స్వయం’ అనే పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై...
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను ఆకట్టుకునేలా లోగో: సీఎం
మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయం.. సెర్ప్, మెప్మాపై సమీక్షలో సీఎం ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం ‘స్వయం’ అనే పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై బుధవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు.. లోగోలను పరిశీలించారు. లోగో ఖరారులో డ్వాక్రా సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని.. మెజారిటీ అభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారుచేస్తున్నారని, వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్థానికంగానే గాక జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలా ఆ ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే.. అదే స్థాయిలో ఆకర్షణీయ బ్రాండింగ్ ఉండాలని చెప్పారు. బ్రాండ్ పేరు, లోగో ఆకట్టుకునేలా ఉండాలని.. వాటితోనే కాన్సెప్ట్ అందరికీ అర్థమయేలా ఉండాలని తెలిపారు. స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళలు ఉత్పత్తులను తెస్తున్నందువల్ల ‘స్వయం’ అనే పేరు బాగుంటుందన్నారు. అదే తరహాలో లోగో డిజైన్ కూడా ఉండాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.