Share News

తిరుమల పవిత్రతకు భంగం కలగొద్దు

ABN , Publish Date - Mar 22 , 2026 | 03:20 AM

తిరుమలలో భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

తిరుమల పవిత్రతకు  భంగం కలగొద్దు

  • భక్తులకు చిన్న ఇబ్బంది కూడా రావొద్దు

  • ప్రసాదాలు, తాగునీటిలో నాణ్యత కోసం

  • టెక్నాలజీని సమర్థంగా వినియోగించాలి

  • కల్తీ నివారణే లక్ష్యంగా పని చేయాలి

  • అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశం

  • తిరుమలలో స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ ప్రారంభం

తిరుమల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కల్తీ నివారణ లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. దాదాపు రూ.25 కోట్లతో తిరుమలలో ఏర్పాటు చేసిన స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ను చంద్రబాబు శనివారం ప్రారంభించారు. 1981లో నీటి పరీక్షల కోసం చిన్నదిగా ప్రారంభమైన ఈ విభాగాన్ని అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌తో కలిసి ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కిపైగా పరికరాలను స్వయంగా పరిశీలించారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ‘ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పాండా, ‘సీఎ్‌ఫటీఆర్‌ఐ’ డైరెక్టర్‌ గిరిధర్‌, సీనియర్‌ సైంటిస్ట్‌ ఉషారాణి, మైక్రో బయాలజిస్ట్‌ దామిని సింఘానీ ల్యాబ్‌లోని పరికరాల పనితీరును సీఎంకు వివరించారు. కొవ్వు ఆమ్లాలు, పురుగుమందులను పరీక్షించే జీసీ-ఎంఎస్‌; మైక్రో టాక్సిన్లు, ఔషధాలు, యాడిటివ్‌ల పరీక్షకు వినియోగించే హెచ్‌పీఎల్‌సీ-ఎల్‌సీ ఎంఎస్‌; ఆహారం, నీటిలో లోహాల గుర్తింపు కోసం వాడే ఏఏఎ్‌స-ఐసీపీ-ఎంఎస్‌ మిషన్‌; ఫైబర్‌, ప్రొటీన్‌, ఫ్యాట్‌ అనలైజర్లు, బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్‌, యూవీ-విజిబుల్‌ స్పెక్ర్టోఫొటోమీటర్‌ వంటి యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులతో మాట్లాడుతూ, భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా కలిగించకూడదని స్పష్టం చేశారు. ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను ఏ స్థాయిలో విశ్లేషించవచ్చని సీఎం అడిగి తెలుసుకున్నారు. బ్యాక్టీరియా గుర్తింపు కోసం ప్రత్యేకంగా క్లీన్‌ రూమ్‌, ఎయిర్‌ హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌ వంటి భద్రతా ప్రమాణాలను చూసిన సీఎం.. అధికారులను అభినందించారు. ల్యాబ్‌ పరీక్షలకే పరిమితం కాకుండా అన్నప్రసాద కేంద్రాల్లోని వంటశాలల శుభ్రతపై కూడా దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఈ ల్యాబ్‌లో ప్రస్తుతం నెలకు వెయ్యి నుంచి 1,500 శాంపిళ్లను విశ్లేషిస్తున్నామని అధికారులు తెలిపారు.


టౌన్‌షిప్‌పై నివేదిక ఇవ్వండి

తిరుమల పర్యటనలో భాగంగా టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలు, చేస్తున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అలాగే గతంలో ఆదేశించిన పనులు ఏ స్థాయిలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అలిపిరిలో ఏర్పాటు చేయదలుచుకున్న ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటుపై కూడా చర్చించారు. ఈక్రమంలో దాదాపు 10 ఎకరాల్లో ఉన్న శిల్ప కళాశాలను మినహాయించి మిగిలిన ప్రాంతంలో టౌన్‌షి్‌పను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు సీఎంకు వివరించారు. అయితే అలిపిరిలో లేదా జూపార్క్‌ రోడ్డులో ఈ టౌన్‌ షిప్‌ ఏర్పాటు చేసే అంశంపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తిరుమల మొత్తం దివ్య ఔషధ మొక్కలను ఏర్పాటు చేయాలన్నారు. బయోగ్యాస్‌ ప్లాంట్‌, విద్యుత్‌ సరఫరాపై కూడా చర్చించారు.

కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలివే..

ఆధ్యాత్మికం, సేవ, సాంకేతిక, స్థిరత్వం అనే నాలుగు లక్ష్యాలతో గత ఏడాది ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటైంది.

తిరుమల పవిత్రతను పరిరక్షించడం.

రద్దీ నిర్వహణలో క్రమశిక్షణ

సేవల్లో పారదర్శకత

టీటీడీ పాలనలో సాంకేతిక వినియోగం.


ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చాలి

టీటీడీ పరిధిలోని ఆలయాలను అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, మరిన్ని ఆలయాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ కమాంట్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. అధికారులు ఈ సెంటర్‌పై ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను తిలకించారు. అమెరికాకు చెందిన దాత జయప్రసాద్‌, కార్య ఫౌండేషన్‌ సహకారంతో ఈ సెంటర్‌ ద్వారా అందిస్తున్న సేవలను సీఎంకు అధికారులు వివరించారు. దీనిపై అధికారులతో ఆయన కొద్ది సమయం సమీక్షించారు. భక్తుల సమస్యలను ముందుగానే గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా ప్రస్తుత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. క్యూలైన్‌లో ప్రవేశించిన క్షణం నుంచి దర్శనం పూర్తయ్యే వరకు వారికి అందించే సేవలన్నిటినీ ఈ సెంటర్‌ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు, ఫేసియల్‌ రికగ్నిషన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 03:22 AM