ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం
ABN , Publish Date - Jun 04 , 2026 | 04:16 AM
రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనేది తన ఆశయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులు ఉన్నప్పుడే సంపన్నవంతమైన జాతి నిర్మాణం సాధ్యమని చెప్పారు.
లలితా పీవీఎస్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం
గుంటూరు మెడికల్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనేది తన ఆశయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులు ఉన్నప్పుడే సంపన్నవంతమైన జాతి నిర్మాణం సాధ్యమని చెప్పారు. అందుకే హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనలో ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. బుధవారం గుంటూరు నగర శివార్లలో తక్కెళ్లపాడు వద్ద రూ.400కోట్లతో నిర్మించిన లలితా పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌సను ఆయన ప్రారంభించారు. ఏడు ఎకరాల్లో 600 పడకలతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు. ఒకేచోట 32 విభాగాలకు సంబంధించి వైద్యసేవలు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందాలని సీఎం ఆకాంక్షించారు. ‘ప్రభుత్వం త్వరలో సంజీవని ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రాం. దీనిద్వారా ప్రజల ఇళ్ల దగ్గరకే అత్యుత్తమ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ రికార్డులు తీసుకొస్తున్నాం. 42 రకాల వైద్యపరీక్షలు ఇంటి దగ్గరే చేస్తాం. త్వరలో యూనివర్సిల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం. ఒకొక్కరికి రూ.2.50 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తాం.’ అని సీఎం వెల్లడించారు. ‘ఒకప్పుడు ఎరువులు లేకుండా పంటలు పండించారు. కానీ ఈరోజు యూరియా, క్రిమి సంహారక మందులు వాడుతున్న ఆహారం తీసుకుంటున్నాం. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లో ఉన్న దీనిని రాబోయే నాలుగేళ్లలో 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తాం’ అని సీఎం తెలిపారు. ‘ఉత్తమ హాస్పటళ్లను రాష్ర్టానికి రప్పిస్తున్నాం. టెక్నాలజీతో వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. రాబోయే పాతికేళ్లల్లో అమరావతి బెస్ట్ మెడికల్ టూరిజం స్పాట్‌గా ఎదుగుతుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో యోగ శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలి’ అని ముఖ్యమంత్రి సూచించాచారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, లలితా పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్, కార్డియాలజిస్ట్ డాక్టర్ పీవీ రాఘవశర్మ, ఎండీ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి. విజయ, సీఈవో డాక్టర్ పి.అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.