Share News

తెలుగు జాతి ఖ్యాతి

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:30 AM

అమరావతి భవిష్యత్తు నగరం. ఇలాంటి నగరాలు మరిన్ని దేశంలో రావాలని కేంద్ర ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగు జాతి ఖ్యాతి

  • విశ్వనగరంగా రాజధాని అభివృద్ధి

  • ఇతర రాష్ట్రాలతో సమానంగా మనకు మహానగరం అవసరం

  • ఎన్‌ఆర్‌ఐ వైద్యులు శాశ్వతంగా ఈ ప్రాంతంతో మమేకం కావాలి

  • గుంటూరు జీజీహెచ్‌లో కానూరి జింకాన ఎంసీహెచ్‌ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు

గుంటూరు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతి భవిష్యత్తు నగరం. ఇలాంటి నగరాలు మరిన్ని దేశంలో రావాలని కేంద్ర ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు మెడికల్‌ కళాశాలలో చదువుకుని అమెరికాలో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐ వైద్యులు రూ.100 కోట్లు విరాళాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జీజీహెచ్‌లో నూతనంగా నిర్మించిన కానూరి జింకాన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ వైద్యులు, దాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘2019-24లో అనేక ఇబ్బందులు పడ్డాం. అవన్నీ పోయాయి. మీరు పుట్టిన గుంటూరు మరో పది, పదిహేనేళ్లలో మారిపోతుంది. అమరావతి.. గుంటూరు, విజయవాడ, మంగళగిరి కార్పొరేషన్లలో కవర్‌ అవుతుంది. అవుటర్‌ రింగురోడ్డు గుంటూరు, విజయవాడకు అవతల వస్తుంది. ఈ రోజున హైదరాబాద్‌లో 162 కిలోమీటర్ల అవుటర్‌ రింగురోడ్డు ఉంది. అమరావతికి 182 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌, ఐఆర్‌ఆర్‌, నేరుగా ఉండే రోడ్లు వస్తాయి. అన్ని సర్వీసులు డక్ట్‌లో ఉంటాయి. రోడ్లు కట్‌ చేసే పరిస్థితి ఉండదు. పర్యావరణహిత నగరంగా అభివృద్ధి చేస్తాం. ఇలాంటి ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం.

అమరావతిలో క్వాంటం వ్యాలీ

ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ నగరం కావాలని ఆలోచించి, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు చిరునామాగా తెలుగువారు ఉండాలని దానిని ఏర్పాటు చేశాం. ఇటీవల ఆ నగరం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ తలసరి ఆదాయాన్ని ఇస్తోంది. హైదరాబాద్‌ కంటే మెరుగైన నగరం నిర్మించాలని అమరావతికి శ్రీకారం చుట్టాం. ఇది గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ. ఆ రోజున ఐటీ గురించి చెప్పాం. ఈ రోజున ఏఐ గురించి మాట్లాడుతున్నాం. అమెరికాకు సిలికాన్‌ వ్యాలీ ఉంది. భారత దేశానికి ఏముందంటే.. క్వాంటం వ్యాలీ ఉంది. అది కూడా అమరావతిలో ఉందని సమాధానం చెప్పొచ్చు. ఆ రోజున సైబరాబాద్‌ కట్టాం. ఈ రోజున క్వాంటం వ్యాలీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మరోవైపు నాలెడ్జ్‌ ఎకానమిలో ఉన్నాం. ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి జరుగుతోంది. మీరు ఇప్పుడు బిల్డింగ్‌ ఇచ్చారు. పైన సోలార్‌ పెడితే కరెంటు కూడా మీరే ఇచ్చినట్లు. ఇవన్నీ సింపుల్‌ ఎడిషన్స్‌. అందుకే ప్రొసూమర్‌(ఉత్పత్తిదారు+వినియోగదారుడు) అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చాం.


నాడు విద్యుత్‌కు కటకట

1999లో విద్యుత్‌ లేని పరిస్థితి. పొలాలు ఎండిపోయేవి. అసెంబ్లీలో గంటల తరబడి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడేవారు. అప్పుడు విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం. 2004లో పవర్‌ షార్ట్‌ లేకుండా చేశాం. అయితే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వలన నా పవర్‌ పోయింది. అయినా ఫర్వాలేదు. ఈ రోజున ప్రపంచంలో విద్యుత్‌ రంగంలో నంబరు1గా భారత దేశం ఉండటం గర్వకారణం.

పర్సనల్‌ మెడిసిన్‌ ఎంతో దూరంలో లేదు

పర్సనల్‌ మెడిసిన్‌ ఎంతో దూరంలో లేదు. నేను 1995లో ఐటీ ప్రమోట్‌ చేశాను. 1999-2000లో బయోటెక్నాలజీని ప్రమోట్‌ చేశాను. టెక్నాలజీతో వైద్యాన్ని రోగి ఇంటి వద్దకు తీసుకెళ్లాలని సంజీవని ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ తరపున సహకరిస్తామన్నారు. ఒక నియోజకవర్గాన్ని కేస్‌ స్టడీగా తీసుకుని 70 వేలమందికి టెస్టులు చేశాం. 2026లో 28 జిల్లాలలో పూర్తిగా సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు తయారు చేయడమే కాకుండా 72 లక్షల మంది తీవ్ర అనారోగ్యం కలిగిన రోగుల డేటా తీసుకొంటున్నాం.

కొత్తగా ఎయిర్‌ అంబులెన్స్‌

ఎవరైనా రోగి ఇంటి వద్ద ఉంటే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైనప్పుడు అరగంటలో ఆస్పత్రికి తరలించే వ్యవస్థ రాబోతున్నది. కొత్తగా ఎయిర్‌ అంబులెన్స్‌ వస్తోంది. 2026లో డ్రోన్‌తో ఎయిర్‌ అంబులెన్స్‌ను ఇంటిగ్రేట్‌ చేయాలనుకొంటున్నాం. డ్రోన్‌లే మిద్దెపై నుంచి రోగులను ఆస్పత్రికి తీసుకెళతాయి. ఇలాంటి వినూత్న ఆలోచనలు చేస్తున్నాం. మీరు ఎన్‌ఆర్‌ఐలు.. మీకు అపారమైన జ్ఞానం ఉంది. భవిష్యత్తులో మీరు చదువుకున్న కాలేజీతో శాశ్వతంగా భాగస్వామ్యం కావాలంటే ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులతో ఉంటూ సేవలందించొచ్చు. అమెరికా కంటే బెటర్‌ సిటీగా అమరావతిని తయారు చేస్తాం. మీకు ఏది కావాలన్నా ఎక్కడికీ పోవాల్సిన పని లేదు. అన్ని అనుమతులు ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. వీలైనంతమంది ఎన్‌ఆర్‌ఐ వైద్యులు ముందుకొచ్చి పీ-4లో భాగస్వామ్యమై మార్గదర్శకులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, ఎండీ నసీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.


దేశాభివృద్ధికి తోడ్పడండి

గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు గేమ్‌చేంజర్‌ వంటి సంజీవిని పథకంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘నేను తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో బ్రెయిన్‌ డ్రెయిన్‌ (మేధో వలస) వల్ల నష్టం ఉంటుందా? అని కొందరు అడిగారు.. బ్రెయిన్‌ డ్రెయిన్‌ భవిష్యత్తులో బ్రెయిన్‌ గెయిన్‌ (దేశానికి సంపద సృష్టి)గా మారుతుందని చెప్పాను. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే ఈ ఎన్‌ఆర్‌ఐ వైద్యులు. అమెరికాతో సహా వివిధ దేశాల్లో స్ధిరపడిన ప్రవాస భారతీయులు తమ మాతృ దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో త్వరలో డ్రోన్‌ అంబులెన్స్‌లు ప్రవేశపెడతామన్నారు.

అమరావతి..కొంతమంది 100 ఎకరాలు తీసుకుని సచివాలయం కట్టొచ్చని అంటున్నారు. లేకపోతే మున్సిపల్‌ భవనంలో సెక్రటేరియట్‌ పెట్టొచ్చు కదా అని అంటారు. అలా కూడా చేయొచ్చు కానీ జాతికి గుర్తింపు ఉండాలన్నా.. అన్ని ప్రాంతాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌ ఉండాలన్నా.. ఒక విశ్వనగరం అవసరం.

తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్‌ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఒక విశ్వనగరం అవసరం. ఏపీ రాజధానిని ఓ చిన్ననగరంగా వదిలేస్తే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామన్న ఉద్దేశంతోనే హైదరాబాద్‌ కంటే మెరుగైన నగరం నిర్మించాలని అమరావతికిశ్రీకారం చుట్టాం.

- సీఎం చంద్రబాబు

Updated Date - Jan 31 , 2026 | 05:31 AM