Share News

జలధారతో ప్రతి ఎకరాకూ నీరు

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:18 AM

‘‘జలమే సంపద.. నీటిని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జలధారతో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా జలహారతి కార్యాచరణ చేపడతామన్నారు.

జలధారతో ప్రతి ఎకరాకూ నీరు

  • నీరు ఉంటే సంపద ఉన్నట్టే

  • జల సంరక్షణకు 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌

  • రాష్ట్రానికి ద్రోహం చేసిన వైసీపీ

  • జగన్‌కు పిచ్చి ముదిరి ‘మావిగన్‌’ మాటలు

  • పెట్టుబడులు వస్తుంటే ఓర్వలేక కుట్రలు

  • ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు

  • 2027 గోదావరి పుష్కరాల్లోపే పోలవరం

  • అనంతపురం.. జలధార సభలో చంద్రబాబు

  • ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ యాప్‌ ఆవిష్కరణ

పరిగెత్తే నీటిని నడిపించాలి. నడిచే నీటిని నిలబెట్టాలి. నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి. జలాశయాలన్నింటినీ నీటితో నింపే బాధ్యతను అందరూ తీసుకోవాలి. ఇది ఈ రోజు చెప్పిన మాట కాదు. మూడు దశాబ్దాలుగా చెబుతున్నా. ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం. చెక్‌ డ్యాంలు కట్టాం. తుంపర సేద్యానికి ప్రాధాన్యతనిచ్చాం. సూక్ష్మసేద్యాన్ని తీసుకొచ్చాం. రెయిన్‌ గన్‌లు కూడా అందించాం.

- చంద్రబాబు

అనంతపురం, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘‘జలమే సంపద.. నీటిని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జలధారతో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా జలహారతి కార్యాచరణ చేపడతామన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో జలధార, ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ముందుగా ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ పేరుతో రూపొందించిన వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ యాప్‌ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. నీటిని సంరక్షించుకునేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను చేపట్టామన్నారు. ఇదొక మహోన్నత లక్ష్యమన్నారు. ఎన్టీఆర్‌ జలసిరి తీసుకొచ్చామని, ట్రెంచ్‌లు కొట్టామని,నీరు-చెట్టు, నీరు-ప్రగతి కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు. ఇంకా ఏమన్నారంటే..


ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇక్కడి నుంచే

అనంత జిల్లాలో ఒకప్పుడు పదేళ్లలో 8 సంవత్సరాలపాటు పంటలు వచ్చేవి కాదు. రైతుల కష్టాలు చూసి చలించిపోయాను. తొలిసారిగా అనంత జిల్లా నుంచే ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీని ప్రారంభించాం. 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. ఈ ఏడాది 1.26 లక్షల హెక్టార్లకు మైక్రో ఇరిగేషన్‌ పరికరాలు ఇచ్చాం. ఈ విషయంలో దేశంలో నంబర్‌వన్‌గా ఉన్నాం. రాయలసీమలో ఉద్యాన పంటలకు మైక్రో ఇరిగేషన్‌ ఇచ్చాం. పండ్లు, కూరగాయలు పండించడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. వచ్చే 6-7 ఏళ్లలో ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టడంతోపాటు మరో రూ.70 వేల కోట్ల మేరకు ప్రైవేటు పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచస్థాయిలో సీమను హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేసే బాధ్యత తీసుకుంటున్నాం. రైతులు కూడా శ్రద్ధ పెడితేనే ఇది సాధ్యపడుతుంది.


21 నెలల్లో ఎన్నో మార్పులు

అధికారంలోకొచ్చాక 21 నెలల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 28,628 చెరువులు ఉంటే.. వాటిలో 20 వేల చెరువులను నీటితో పూర్తిగా నింపాం. గతేడాది 10.62 మీటర్ల లోతులో ఉండే భూగర్భ జలాలను 8.7 మీటర్లకు తగ్గించాం. 1.92 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి. రాష్ట్రంలో 40 శాతందాకా 3.08 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. అనంత జిల్లాలో 2024 ఏప్రిల్‌లో 11.36 మీటర్లలో ఉంటే... ప్రస్తుతం 11.25 మీటర్ల లోతులో భూగర్బజలాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో జలధార జలసిరి కింద పెద్ద ప్రయోగం చేశాం, అక్కడ ఒకే సంవత్సరంలో 8 మీటర్ల దాకా భూగర్భజలాలు పెంచగలిగాం. అన్నమయ్య జిల్లాలో 5.71 టీఎంసీల భూగర్భ జలాలు పెరిగాయి. 30 నుంచి 40 శాతం బోర్లలో విద్యుత్‌ వాడకం తగ్గింది. ఒక జిల్లాలోనే రూ.96 కోట్ల విలువైన కరెంటు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది. బ్యాంకుల్లో డబ్బు ఎలా దాచిపెట్టుకుంటారో... నీటికి భూమిలోనైనా.. రిజర్వాయర్‌లోనైనా పెట్టుకోగలిగితే అదే సంపదను సృష్టిస్తుంది. ప్రజలందరూ ఐక్యం కావాలి. జలసిరి.. జలధారతో ప్రతి ఎకరాకీ జలహారతి ఇవ్వాలి. శ్రీశైలం నుంచి నీటిని తీసుకొస్తున్నాం. హెచ్చెల్సీ ద్వారా కొంత వరకు నీళ్లు వస్తున్నాయి. ఈ ఏడాది 74 టీఎంసీల నీళ్లు అనంతకు తీసుకొచ్చాం. పట్టిసీమలో నీరు లిఫ్ట్‌ చేసి, నేరుగా కృష్ణాడెల్టాకు తీసుకొచ్చాం. అక్కడ ఖరీఫ్‌, రబీ సీజన్లకు వాడే నీటిని పొదుపు చేసి, సీమకు మళ్లించి రతనాల సీమగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గంగ నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలి. అదే జరిగితే దేశంలో సంపదకు కొదవ ఉండదు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీని అడిగా. ముందుగా రాష్ట్రంలో చేయమని, తర్వాత దేశంలో కూడా చేస్తామని ఆయన చెప్పారు.


కరెంటు చార్జీల భారం పడకుండా

గత వైసీపీ హయాంలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. రూ.1.25 లక్షల కోట్లతో విద్యుత్‌ శాఖను అప్పుల్లోకి నెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పాం. ఆ హామీని నిలబెట్టుకున్నాం. వైసీపీ హయాంలో పెంచిన రూ.4,680 కోట్ల ట్రూ అప్‌ చార్జీలను టూ డౌన్‌ చేసి.. ప్రజలపై భారం తగ్గించాం. రాష్ట్రంపై వైసీపీ నాయకులు పగబట్టి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కడపలో వైసీపీ హయాంలో నిర్మించకుండా వదిలేసిన స్టీల్‌ప్లాంట్‌ను వచ్చే ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం. పెట్టుబడులు వస్తున్నాయని, ఉద్యోగాలు వస్తాయని యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిసి.. ఓర్వలేక పెట్టుబడులు పెట్టే వాళ్లను భయపెడుతున్నారు.

ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్‌

రాష్ట్రంలో ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. వారి జోలికొస్తే అదే చివరి రోజు అవుతుంది. కొందరు నేరాలు, ఘోరాలు చేసి తప్పించుకోవచ్చు. చివరకు నా మీద నేరాలు మోపే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దేవాలయలపై దాడులు చేస్తారు. ఇదేమిటని అడిగితే ఎదురుదాడికి దిగుతున్నారు. గతంలో తిరుమలలో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేశారు.

Updated Date - Apr 07 , 2026 | 05:20 AM