Share News

నేతన్నలకు నేనున్నా

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:14 AM

రాష్ట్రంలో నేతన్నలకు తాను అండగా ఉంటానని, వారి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యుత్‌ బిల్లుల విషయంలో చేనేత కార్మికులకు ఊరటని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ....

నేతన్నలకు నేనున్నా

  • వారి సమస్యలకు దశలవారీగా పరిష్కారం

  • ఉచిత విద్యుత్‌ పథకంతో కొత్త కాంతులు

  • ఏటా రూ.150 కోట్లకు పైగా బిల్లులో ఆదా

  • మత్స్యకారుల ప్రయోజనాలకే ప్రాధాన్యం

  • సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

నెల్లూరు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నేతన్నలకు తాను అండగా ఉంటానని, వారి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యుత్‌ బిల్లుల విషయంలో చేనేత కార్మికులకు ఊరటని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి ఉచిత విద్యుత్‌ విధానం అమల్లోకి తెచ్చింది. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ఈ పథకంపై స్పందించారు. ‘‘చేనేత కార్మికుల సంక్షేమంలో భాగంగా బుధవారం నుంచి ఆ వర్గాలకు ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేస్తున్నాం. హ్యాండ్లూమ్‌ మగ్గాలు కలిగిన వారికి నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తాం. దీనివల్ల 93 వేల చేనేత కుటుంబాలకు, 11,488 పవర్‌లూమ్‌ కుటుంబాలకు ఏటా రూ.150 కోట్ల వరకు ఆదా అవుతుంది. ఉచిత విద్యుత్‌ వల్ల హ్యాండ్‌లూమ్‌ కార్మికులకు ఏటా రూ.8,600 చొప్పున, పవర్‌లూమ్‌కు రూ.21,800 చొప్పున ఆదా అవుతుంది’’ అని సీఎం తెలిపారు. రాష్ట్రంలో మత్య్సకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ‘‘మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మత్స్యకారులకు అన్యాయం చేయరు. చేయాలని ప్రయత్నించినా నేను అంగీకరించను. జువ్వలదిన్నెలో జరిగిన ఒక సంఘటనను టీడీపీ నాయకుల మీద నెట్టాలని వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటివరకు మత్స్యకారుల సంక్షేమానికే కృషి చేసింది. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. ఆంధ్రరాష్ట్ర జలాల్లోకి ప్రవేశించి (తమిళనాడు జాలర్లు) సమస్య సృష్టించడం సరికాదు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మన ప్రాంతంలో చేపల వేటకు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దు. ఎవరు చెప్పినా లెక్కచేయవద్దు.’’ అని తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికి జనం వేసిన ఓటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడిందన్నారు. ఎన్ని సమస్యలు తలెత్తినా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని పునరుద్ఘాటించారు.


వింజమూరు వాసులకు సీఎం అభినందన

నెల్లూరు జిల్లా వింజమూరు వాసులు తమ గ్రామంలోని పాతూరు చెరువుకు స్వచ్ఛంద శ్రమదానం ద్వారా మరమ్మతులు చేసుకున్నారు. తన దృష్టికి గ్రామస్థులు ఈ విషయం తీసుకురాగా, సీఎం ఉత్సాహంగా స్పందించారు. ‘‘30 సంవత్సరాల క్రితం నేను చేపట్టిన జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తిని మీరు గుర్తుచేశారు. మీరు ఒక అడుగు వేస్తే నేను ఊరుకుంటానా..!? నేను వంద అడుగులు వేస్తాను. మీరు కోరినట్టే ఆరునెలల్లో చెరువుకు సోమశిల నీటిని మళ్లిస్తాను. దీనికోసం 34 కోట్లు కూడా మంజూరు చేస్తున్నాను.’’ అని ప్రకటించారు.

ఎన్నికల హామీని బాధ్యతగా నెరవేర్చాం

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను ఓ హామీగా కాకుండా బాధ్యతగా తీసుకున్న ప్రజాప్రభుత్వం.. నేడు చేనేత సోదరుల జీవితాల్లో వెలుగులు నింపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని బుధవారం నుంచి అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘మగ్గం ఆడితేనే ఇంట్లో దీపం వెలిగే నేతన్నల కష్టాన్ని అర్ధం చేసుకుని ఉచిత విద్యుత్తు పథకానికి శ్రీకారం చుట్టాం. 93 వేల చేనేత మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు బుధవారం నుంచే అమల్లోకి వస్తోంది. విద్యుత్తును రాయితీగానే కాదు.. ఒక్కో నేతన్న కష్టానికి ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.

దిగులొద్దు..మీ బిడ్డకు వైద్యం చేయిస్తా

  • ఓ తల్లికి చంద్రబాబు భరోసా

వింజమూరులోని ఎస్సీ కాలనీకి చెందిన లబ్ధిదారు యరగొర్ల బాలమ్మ ఇంటికి సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి వితంతు పింఛన్‌ అందజేశారు. ఈ క్రమంలో తన చిన్నకుమారుడు బాలరాజు కాలేయ సమస్యతో బాధ పడుతున్నాడని బాలమ్మ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు స్పందిస్తూ.. ‘దిగులు పడకండి. బిడ్డకు వైద్యం చేయించే బాధ్యత నేను తీసుకుంటా’ అని ఆ తల్లికి భరోసా ఇచ్చారు.

Updated Date - Apr 02 , 2026 | 04:14 AM