Share News

చంద్రబాబుతోనే దివ్యాంగులకు గౌరవం

ABN , Publish Date - Mar 19 , 2026 | 05:51 AM

దివ్యాంగులకు గుర్తింపు, గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని... వారి సంక్షేమం, సామాజిక, ఆర్థిక ఎదుగుదల కోసం కూటమి...

చంద్రబాబుతోనే దివ్యాంగులకు గౌరవం

  • దివ్యాంగశక్తి ప్రారంభంలో మంత్రులు అచ్చెన్న, సంధ్యారాణి, కొండపల్లి, దుర్గేశ్‌

  • రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

అరసవల్లి, పార్వతీపురం, విజయనగరం, నిడదవోలు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు గుర్తింపు, గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని... వారి సంక్షేమం, సామాజిక, ఆర్థిక ఎదుగుదల కోసం కూటమి ప్రభుత్వం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌, కందుల దుర్గేశ్‌ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌తో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభించగా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. శ్రీకాకుళం జిల్లా రాగోలులో అచ్చెన్నాయుడు దివ్యాంగశక్తి పథకం బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రారంభించినట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. విజయనగరం ఆర్టీసీ డిపో ఆవరణలో దివ్యాంగ శక్తి పథకాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగుల కోసం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేశ్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల ఆత్మ గౌరవాన్ని పెంచేలా ఈ పథకాన్ని చేపట్టిందన్నారు. అనంతనం దివ్యాంగులకు భోజనం వడ్డించి విందులో పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 05:51 AM