అభివృద్ధికి జనమే కీలకం
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:50 AM
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనాభా కీలకమని, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ‘సంజీవని’ కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు.
జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ ముఖ్యం
ప్రపంచ జనాభా దినోత్సవంలో చంద్రబాబు
విజయవాడ, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనాభా కీలకమని, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ‘సంజీవని’ కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచే పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ప్రత్యేకంగా చైల్డ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. జనాభా నియంత్రణ కంటే జనాభా సంరక్షణ ఇప్పుడు అత్యవసరమని స్పష్టం చేశారు. ‘పిల్లలే సంపద’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కడప జిల్లాలో జనాభా పెరుగుదల అధికంగా ఉండగా.. అభివృద్ధి చెందిన విశాఖలో అత్యల్ప స్థాయిలో ఉండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. వృద్ధుల సంఖ్య పెరుగుతోందని సీఎం చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సామాజిక మాధ్యమాల మోజులో యువత విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్రంలో సంజీవని కార్యక్రమం చేపట్టనున్నట్టు సీఎం వెల్లడించారు. త్వరలో వృద్ధుల కోసం ‘క్షేమం’ అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేయనున్నట్టు వెల్లడించారు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలకు చేర్చాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు.