Share News

ఏపీలో అద్భుత ప్రదేశాలున్నాయి

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:26 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆతిథ్య రంగంలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని తమారా లీజర్‌ సీఈవో సృష్టి శిబులాల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

ఏపీలో అద్భుత ప్రదేశాలున్నాయి

  • ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టండి

  • తమారా లీజర్‌ను కోరిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఆతిథ్య రంగంలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని తమారా లీజర్‌ సీఈవో సృష్టి శిబులాల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దావోస్‌ ఆర్థిక సదస్సులో చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించామని చంద్రబాబు వెల్లడించారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. పోలవరం నుంచి భద్రాచలం వరకూ గోదావరి నదీ తీరంలో అద్భుతమైన టూరిజం కేంద్రాలున్నాయన్నారు. కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి లాంటి మంచి పర్యాటక కేంద్రాలున్నాయని వివరించారు. ప్రతి పర్యాటక ప్రాంతానికీ రోడ్డు, రైలు, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ ఉందన్నారు. టూరిజం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేస్తుందని, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం పెంచుతున్నామన్నారు. తాము త్వరలోనే ప్రతిపాదనలతో వస్తామని సీఈవో వెల్లడించారు.

అమరావతిలో యువతకు ఏఐ నైపుణ్య శిక్షణ

  • చంద్రబాబుతో కాలిబో అకాడమీ చైర్మన్‌ భేటీ

దావోస్‌ పర్యటనలో సీఎం చంద్రబాబుతో కాలిబో ఏఐ అకాడమీ వ్యవస్థాపక చైర్మన్‌ రాజ్‌ వట్టికూటి భేటీ అయ్యారు. వట్టికూటి అకాడమీ ద్వారా యువతకు అమరావతిలో ఏఐ నైపుణ్య శిక్షణను ప్రారంభిస్తున్నట్లు రాజ్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర విద్యాలయాల భాగస్వామ్యంతో యువతకు ఏఐలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. విశాఖ మధురవాడ ఐటీ సెజ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - Jan 22 , 2026 | 04:26 AM