Share News

పొలాల్లో తిరుగుతూ.. రైతులను కలుస్తూ..

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:27 AM

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఓ రైతు బిడ్డలా పంట పొలాల్లో తిరుగుతూ..

పొలాల్లో తిరుగుతూ.. రైతులను కలుస్తూ..

  • సూరంపల్లిలో కలయతిరిగిన సీఎం

విజయవాడ సిటీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఓ రైతు బిడ్డలా పంట పొలాల్లో తిరుగుతూ.. రైతులను కలుస్తూ గడిపారు. ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి వచ్చిన ఆయన అక్కడి రైతులను పలకరించారు. తాను ఎంతగానో ప్రోత్సహించే నీటి భద్రత, అగ్రి టెక్‌ వంటి విధానాలు అక్కడ అవలంభించడం చూసి ముచ్చట పడ్డారు. వారి పనిలో తాను కూడా ఓ చెయ్యేసి రైతులతో మాటామంతి సాగించారు. ముఖ్యంగా యువ రైతులు టెక్నాలజీని అంది పుచ్చుకుంటున్న తీరును అభినందించారు. డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న యువ రైతు తోట వడ్డికాసులును ప్రత్యేకంగా అభినందించారు. డ్రోన్‌లో విత్తనాలు పోయడం, అది సాళ్లలో తిరుగుతూ విత్తనాలు పొలంలో వదిలే విధానం స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే సీఎం కొద్ది సేపు డ్రోన్‌ ఆపరేట్‌ చేశారు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుంది, ఎంత మంది కూలీలు అవసరం అవుతారు, ఫలితం ఎలా ఉంటుంది.. తదితర అంశాలను ఆరా తీశారు. అత్యంత తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే పని పూర్తవుతుందని వడ్డికాసులు చెప్పిన సమాధానానికి సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డ్రోన్‌ను పరిశీలించిన అనంతరం తులిమిల్లి లక్ష్మణరావు సాగు చేస్తున్న టమాటా తోటను సీఎం పరిశీలించారు.

Updated Date - Mar 14 , 2026 | 05:27 AM