వినూత్నంగా ఆలోచించండి
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:28 AM
విద్యార్థులు వినూత్నంగా ఆలోచించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, అలాంటి ఆలోచనలకే భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని సీఎం చంద్రబాబు అన్నారు.
కుప్పం ‘అగస్త్య’ విద్యార్థులతో సీఎం చంద్రబాబు
కుప్పం/గుడుపల్లె, జనవరి 30(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు వినూత్నంగా ఆలోచించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, అలాంటి ఆలోచనలకే భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నారు. తొలి రోజు గుడుపల్లె మండలంలోని అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రాంగణంలోని టీచర్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. లెర్నర్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్‌కు, ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడి ఆడిటోరియంలో విద్యార్థులతో సీఎం సమావేశమయ్యారు. ‘భవిష్యత్తు మనదే. రాబోయే రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు వస్తాయి. కొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్ కంపెనీలకు అవకాశాలు దక్కేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. భవిష్యత్తు భారత్ ఎలా ఉంటుందనే అంశంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను గమనించాలి. కుప్పానికి అన్నిరకాల టెక్నాలజీలను తెస్తున్నాం. హంద్రీనీవా నీళ్లు తెచ్చాం. నీటి సంరక్షణ విషయంలో అగస్త్య అకాడమీ ప్రతినిధులు వినూత్నంగా ఆలోచించాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తొలి రోజు కంగుంది హెరిటేజ్ విలేజ్-బౌల్డరింగ్ పార్కును, పున్నమి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అలాగే రూ.4 కోట్లతో కుప్పం పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కుప్పం చెరువుకు జలహారతి ఇచ్చారు. గంగమ్మకు సారె సమర్పించారు. కార్యక్రమాల అనంతరం కడపల్లెలోని స్వగృహంలో బస చేశారు.
