బంధనాల నుంచి భూ విముక్తి
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:24 AM
22ఏ జాబితాలోని భూముల పరిష్కారంపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ జయలక్ష్మి ఇటీవల పలుదఫాలుగా సమావేశాలు నిర్వహించి పరిష్కార మార్గాలు అన్వేషించారు.
22ఏ జాబితా నుంచి నాలుగైదు రకాల భూముల తొలగింపు
అందులో సర్వీసు ఇనాం, హౌసింగ్ స్కీంకు సంబంధించినవి 2.75 లక్షల ఎకరాలు
75 లక్షల ఇళ్లు/పట్టాలకు రిజిస్ట్రేషన్
వాటిపై పేదలకు శాశ్వత హక్కులు
77 లక్షల మందికి ప్రయోజనం
నేడు బాపట్ల జిల్లాలో సీఎం ప్రకటన!
ఫ్రీహోల్డ్ చేసిన భూములకూ విముక్తి
మొత్తంగా 9.25 లక్షల ఎకరాలు విడుదల
ముఖ్యమంత్రి సమీక్షలో కీలక నిర్ణయం
15 రోజుల్లో మార్గదర్శకాలు, విధివిధానాలు
సుదీర్ఘకాలంగా నిషేధ జాబితాలో ఉన్న లక్షల ఎకరాల భూములకు విముక్తి కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీసు ఇనాం, ఇతర ఇనాం భూములు, గృహనిర్మాణ పథకం కింద ఇచ్చిన పట్టాలకు 22ఏ జాబితా నుంచి స్వేచ్ఛ కల్పించనుంది. గురువారం బాపట్ల జిల్లా పర్యటనలో ఆయా భూముల నిషేధ విముక్తి గురించి ముఖ్యమంతి చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఫ్రీహోల్డ్ సమస్యకు కూడా త్వరలో ముగింపు పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
22ఏ జాబితాలోని భూముల పరిష్కారంపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ జయలక్ష్మి ఇటీవల పలుదఫాలుగా సమావేశాలు నిర్వహించి పరిష్కార మార్గాలు అన్వేషించారు. కొన్ని కీలక అధికారాలను వికేంద్రీకరించాలన్న నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఇవే అంశాలపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలోనూ చర్చించారు. 22ఏలో ఉన్న భూముల విముక్తితోపాటు ఫ్రీహోల్డ్, రీసర్వే, రికార్డ్ లాకింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ వంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సర్వీసు ఇనాం, ఇతర ఇనాం భూములు దాదాపు 2.75లక్షల ఎకరాలు ఉన్నాయి.
పేదల చేతుల్లో ఉన్న ఈ భూములు చాలావరకు 22ఏలో ఉన్నాయి. ఈ జాబితా నుంచి వాటిని తొలగించాలని వారు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. అయితే చట్టంలో ని సంక్లిష్టతల వల్ల వాటిని నిషేధ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించలేకపోతోంది. ఇప్పుడు వాటికి విముక్తి కల్పించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. దరిమిలా వాటిని రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత ఆ భూములపై వారికి శాశ్వత హక్కులు వస్తాయి. అవసరాన్ని బట్టి విక్రయించుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది. దీనిని కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎంతో భేటీలో నిర్ణయించారు.
75 లక్షల ఇళ్లకు స్వేచ్ఛ..
దివంగత ఎన్టీఆర్ హయాం నుంచీ ఇప్పటివరకు వివిధ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన దాదాపు 75లక్షల ఇంటిస్థలాలు నిషేధ జాబితాలో ఉన్నాయి. వీటికి కూడా నిషేధ విముక్తి కల్పించాలని మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇది సమావేశం ఎజెండాలో లేదు. కానీ ఈ అంశం చర్చకొచ్చిప్పుడు సీఎం అనేక సందేహాలు లేవనెత్తారు. పేదలకు ఇచ్చిన ఈ ఇళ్లను 22ఏ నుంచి తొలగిస్తే చాలా మేలు జరుగుతుందని అనగాని, సాయిప్రసాద్ సూచించినట్లు తెలిసింది. ఈ నేపఽథ్యంలో ఆ 75లక్షల పట్టాలను 22ఏ నుంచి తొలగించాలని సీఎం ఆదేశించారు. పేదల ఇంటిస్ధలాలు, ఇంటిని వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. పదేళ్ల కాలపరిమితి ముగిసిన వాటిపై శాశ్వత హక్కులు కల్పిస్తారు. దీంతోపాటు ఇనాం భూములకు నిషేధ విముక్తిపై కూడా గురువారం వేమూరు సభలో ఆయన అధికారిక ప్రకటన చేయనున్నారు. దీంతో 2లక్షల మంది రైతులు.. అటు ప్రభుత్వ ఇళ్లకు విముక్తి ద్వారా 75 లక్షల మందికి.. మొత్తం 77 లక్షల మందికి మేలు జరుగుతుంది.
డిజిటల్ లాక్‌ల తొలగింపు..
జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసింది. ఇందులో సింహభాగం అసైన్డ్ భూములే. వాటిలో నిబంధనల ప్రకారం ఉన్నవి 7.85 లక్షల ఎకరాలు. వీటిపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు సీఎం అంగీకరించారు. దీనర్థం.. ఆ భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌లో డిజటల్ లాక్‌లను తొలగిస్తారు. దీంతో ఆ భూములను రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు అమ్ముకునే వెసులుబాటు లభిస్తుంది. ఇంకొన్ని రకాల భూములకు కూడా ఫ్రీహోల్డ్ నుంచి విముక్తి కల్పించనున్నారు. నీటి వనరులతో సంబంధం లేనిచోట ఉన్న 24,216 ఎకరాలు, వెబ్‌ల్యాండ్‌లో పొందుపరిచిన దానికంటే ఎక్కువగా ఫ్రీహోల్డ్ చేసిన 11,749 ఎకరాలు (ఇందులో రీసర్వే డేటాను ప్రామాణికంగా తీసుకుంటారు), ఇప్పటికే పలు దఫాలుగా ఫ్రీహోల్డ్ అయిన 17,897 ఎకరాలు (ఈ కేటగిరీలో చుక్కల భూములు ఉన్నాయి).. ఫ్రీహోల్డ్‌కు అవకాశం ఉండి కూడా కలెక్టర్ ఆదేశాలు లేని 64,143 ఎకరాలు.. పట్టా భూములను పొరపాటుగా అసైన్డ్‌గా నమోదుచేసిన 5,422 ఎకరాలు.. ఫ్రీహోల్డ్ అనంతరం రిజిస్ట్రేషన్ చేసిన 16,801 ఎకరాలు. వీటితో కలిపి మొత్తంగా 9.25 లక్షల ఎకరాలకు విముక్తి కల్పించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ అంశంపై పక్షం రోజుల్లో విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది.