చిరుద్యోగులపై ప్రతాపం ఏంటి?
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:40 AM
టోల్‌గేట్ సిబ్బందిపై కల్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అనుచరులు దాడి చేయడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
ఎమ్మెల్యే సురేంద్రబాబుపై సీఎం సీరియస్
‘టోల్‌గేట్ సిబ్బందిపై దాడి’ ఘటనపై అసహనం
ఎమ్మెల్యే అక్కడే ఉండి కూడా.. అనుచరులను నిలువరించకపోవడం సరికాదని ఆగ్రహం
అమరావతి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): టోల్‌గేట్ సిబ్బందిపై కల్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అనుచరులు దాడి చేయడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. చిన్న చిన్న విషయాలకు చిరుద్యోగులపై దాడి చేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. దాడి సమయంలో అక్కడే ఉండి కూడా ఎమ్మెల్యే తన అనుచరులను నిలువరించకపోవడం సరికాదని, ఇలాంటి చర్యలు అటు పార్టీ ప్రతిష్టను, ఇటు ప్రభుత్వ పరువును దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెబుతున్నా ఎమ్మెల్యేల తీరులో మార్పు రావడం లేదని, ఇకపై ఇలాంటివి పునరావృతమైతే పార్టీపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి దిగిన సురేంద్రబాబు అనుచరులపై కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె-తిరుపతి రహదారిపై గండబోయినపల్లె వద్ద టోల్‌గేట్ సిబ్బందితో శనివారం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు, ఎస్కార్ట్ సిబ్బంది వాగ్వాదానికి దిగి, దాడి చేసిన విషయం విదితమే. ‘ఎమ్మెల్యే వాహనాన్నే ఆపుతారా?’ అంటూ వీరంగం చేశారు. ఘటనపై విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివా్‌సను ఆదేశించారు.