వర్మ తీరు సరికాదు
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:51 AM
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేతగా వ్యవహరించాల్సిన తీరు ..
ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం
ఆయనతో మాట్లాడాలని పల్లాకు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేతగా వ్యవహరించాల్సిన తీరు ఇదికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా(పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) సమావేశం సందర్భంగా మంగళవారం పిఠాపురంలో జనసేన, టీడీపీ నాయకుల నడుమ చోటుచేసుకున్న ప్రొటోకాల్ రగడ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఈ విషయంపై మాట్లాడారు. ‘కూటమిగా ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపొచ్చాలు వస్తుంటాయి. దానికే గొడవలు పెట్టుకోవడం సరైన విధానం కాదు. ప్రతిసారీ గొడవలు పడటం, పార్టీ జోక్యం చేసుకుని సర్దిచెప్పాల్సి రావడం సరికాదు’ అని సీఎం స్పష్టం చేశారు. సీనియర్ నేత అయిన వర్మ వ్యవహరించిన తీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా పొరపాటు, తప్పుజరిగినా పార్టీ పెద్దలకు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ ఇలా గొడవ పడటం వల్ల లాభం ఉండదన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, ఈ విషయంలో వర్మకు తగు సూచనలు చేయాలని పల్లాను సీఎం ఆదేశించారు.