Share News

Polavaram Project: పోలవరం ప్రగతిపై సీఎం హ్యాపీ

ABN , Publish Date - Jan 08 , 2026 | 06:05 AM

డయాఫ్రమ్‌ వాల్‌ విధ్వంసం.. కాఫర్‌ డ్యామ్‌లో సీపేజీ... నిర్మాణాన్ని ఎక్కడినుంచి మొదలుపెట్టాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న పోలవరం ప్రాజెక్టు రూపురేఖలు...

Polavaram Project: పోలవరం ప్రగతిపై సీఎం హ్యాపీ

  • పనులన్నీ గాడిన పడటంపై చంద్రబాబు సంతృప్తి

అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): డయాఫ్రమ్‌ వాల్‌ విధ్వంసం.. కాఫర్‌ డ్యామ్‌లో సీపేజీ... నిర్మాణాన్ని ఎక్కడినుంచి మొదలుపెట్టాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న పోలవరం ప్రాజెక్టు రూపురేఖలు గత 18 నెలల్లోనే పూర్తిగా మారిపోయాయి. స్పిల్‌వే గేట్లు, పూర్తికావస్తోన్న డయాఫ్రమ్‌వాల్‌, ప్రారంభమైన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ -2 పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు తన సంతోషం వ్యక్తం చేశారు. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌-1 పనులు ఈ ఏడాది జూన్‌ నాటికి, గ్యాప్‌-2 పనులు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. దీంతో.. పనులన్నీ గాడిన పడ్డాయన్న సంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు. గ్యాప్‌-2 పనులను 2027 మార్చి నాటికే పూర్తి చేయాలంటూ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ను ఆదేశించారు. డయాఫ్రమ్‌ వాల్‌ పనులు 65,362 చదరపు మీటర్లకు గాను 56,583 చదరపు మీటర్ల (87 శాతం) మేర జరిగాయని అదికారులు వివరించారు. వచ్చే నెల 15వ తేదీనాటికి మిగతా పనులు కూడా పూర్తి చేస్తామని మేఘా ఇంజనీరింగ్‌ అధినేత కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు 2027 జూన్‌ 30 నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఎడమ గడ్డు, కుడి గడ్డు రోడ్లు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. పోలవరం టన్నెల్‌ను సీఎం పరిశీలించారు. అప్రోచ్‌ చానల్‌ను ఈ ఏడాది మే చివరి నాటికి, హెడ్‌ రెగ్యులేటర్‌ను ఈ ఏడాది జూన్‌ నాటికి, ఇరిగేషన్‌ టన్నెల్‌ను ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. వైసీపీ సమయంలో పోలవరం ప్రాజెక్టు దెబ్బతిన్నప్పుడు తనకు నిద్రపట్టలేదని చంద్రబాబు వారికి తెలిపారు. తిరిగి ఇప్పుడు ప్రాజెక్టును చూశాక అనుకున్న లక్ష్యం మేరకు పూర్తి చేయగలనన్న నమ్మకం కలిగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 08 , 2026 | 06:05 AM