బాధ్యతాయుతంగా ఉండండి
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:48 AM
మంత్రు లు బాధ్యతాయుతంగా ఉండాలని, ఏది పడితే అది మాట్లాడవద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది.
ఏది పడితే అది మాట్లాడొద్దు
మంత్రులకు ముఖ్యమంత్రి నిర్దేశం
సబ్జెక్ట్ తెలియకపోతే తెలుసుకుని మాట్లాడండి
అమరావతిలోనే ఎడ్యుకేషన్ సిటీ, హెల్త్ సిటీ
సోలార్ ప్లాంట్ల లీజులతో ‘అసైన్డ్’కు ఆదాయం
అసైన్డ్ లబ్ధిదారులకు అవగాహన కల్పించండి
క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు వెల్లడి
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మంత్రు లు బాధ్యతాయుతంగా ఉండాలని, ఏది పడితే అది మాట్లాడవద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఎజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత మంత్రులకు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన పద్ధతులు, ఇతర అంశాలపై దిశానిర్దేశం చేశారు. మంత్రులు మాట్లాడేటప్పుడు సబ్జెక్టు మీద అవగాహనతో మాట్లాడాలని, విషయం తెలియకపోతే తెలుసుకుని అవగాహన చేసుకుని మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ మార్పు స్పష్టంగా కనబడాలని కోరారు. కేవలం ఎమ్మెల్యేలకే కాకుండా ఐదు కోట్ల మంది ప్రజలకు సమాధానం ఇస్తున్నామని భావిస్తూ, స్పందించాలన్నారు. మంత్రులందరూ అసెంబ్లీకి వచ్చే ముందు తాము సమాధానాలు చెప్పాల్సిన అంశాలపై సంపూర్ణ అవగాహనతో రావాలని కోరారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అసెంబ్లీలో, ఆ తర్వాత సాయంత్రం వరకు మీ పేషీలో ఉండి, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇన్‌చార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు ఆ జిల్లాల్లో అమలవుతున్న అన్ని శాఖల ప్రాజెక్టుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులనన్నింటినీ సమీక్షించి, నిర్దేశిత సమయంలో అవి పూర్తయ్యేలా ఫాలో అప్ చేయాలన్నారు. అసైన్డ్ భూములను సోలార్ ప్రాజెక్టులకు లీజుకు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, తద్వారా ఆ భూముల లబ్ధిదారులకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీని అమరావతిలోనే ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం నివాళి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే ముందు సీఎం చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఏం నేర్చుకుంటున్నాం?: శ్రీశైలం ఘటనపై సీఎం సీరియస్
శ్రీశైలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘తిరుపతి తొక్కిసలాట తర్వాత కూడా అదే తరహా సంఘటన జరగడం సరికాదు. వీటినుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం?’’ అని ప్రశ్నించారు. క్యూ లైనులో ఊపిరాడక పోవడంతో పెద్ద వయసు స్వాములను బయటకు తీసుకొచ్చే క్రమంలో పరిస్థితి అదుపు తప్పిందని హోం మంత్రి అనిత సీఎంకి చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘ఆ విషయాన్ని పోలీసులు క్యూలైనులో ఉన్న వారికి తెలియజేయాలి కదా! ఏం జరుగుతుందో మైకులో పోలీసులు వివరించి ఉంటే భక్తులు అనవసర అపోహలకు గురి అయ్యేవారు కాదు. పరిస్థితి అదుపు తప్పేది కాదు కదా’’ అని సీఎం వ్యాఖ్యానించారు.