విపక్షంగా వైసీపీ విఫలం!
ABN , Publish Date - Feb 25 , 2026 | 03:15 AM
‘మనం అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాటకూ ఎంతో విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి మాట్లాడినట్లే! ఏడాదిపాటు ఊర్లలో...
నిర్మాణాత్మకంగా ఉండకుండా రాజకీయాలకే పరిమితం
అందుకే మనమే విపక్ష పాత్రా పోషించాలి
మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలను ఏఐ ద్వారా విశ్లేషిస్తా
అసెంబ్లీ జరిగినన్ని రోజులూ ఒక అంశంపై లఘు చర్చ
సందర్భాన్ని బట్టి నేను, పవన్ చర్చలో పాల్గొంటాం
క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘మనం అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాటకూ ఎంతో విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి మాట్లాడినట్లే! ఏడాదిపాటు ఊర్లలో తిరిగి మనం చేసే కార్యక్రమాల ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందుతామో.. ఒక రోజు అసెంబ్లీలో మాట్లాడడం ద్వారా అంతకంటే ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మంగళవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముగిసిన తర్వాత.. తాజా రాజకీయ పరిణామాలపై సహచర మంత్రులతో ఆయన చర్చించారు. అసెంబ్లీ సమయం ఎంతో విలువైందని.. సభలో ప్రతిపక్షం పాత్ర కీలకమని, కానీ వైసీపీ నిర్మాణాత్మక పాత్ర పోషించకుండా.. మండలిలోనూ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసలు సభకే రాకుండా బయట రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుచేత ప్రతిపక్ష పాత్రను కూడా మనమే పోషించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో వివిధ శాఖల పద్దులపై జరిగే చర్చల్లో మంత్రులు బాగా సిద్ధమై వచ్చి మాట్లాడాలని.. ఒక మంత్రి ఒక సబ్జెక్టుపై మాట్లాడినప్పుడు.. అనుబంధంగా మాట్లాడేవారూ కంటెంట్‌తో మాట్లాడితేనే ప్రజల్లోకి ఆ అంశం బలంగా వెళ్తుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలు ఎలా ఉన్నాయో కృత్రిమ మేథ (ఏఐ) ద్వారా విశ్లేషణ చేయిస్తానని చెప్పారు.
ప్రతిరోజూ పరీక్షే..
ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రతిపక్షం కేవలం రాజకీయమే చేస్తోందని, దీంతో మనమే అధికారపక్షంతోపాటు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో మనకు ప్రతి రోజూ పరీక్షేనని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేసే మంచి పనిని కిందిస్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు. మంత్రులు తమ శాఖల్లో చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మంత్రులతో బాగా సమాధానాలు ఇప్పించే బాధ్యత సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌దేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ జరిగినన్ని రోజులూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 వరకు ఒక్కో అంశంపై లఘు చర్చ చేపడదామని సూచించారు. ఇందుకు తగ్గట్లుగా అంశాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సందర్భాన్ని బట్టి తాను, పవన్ కల్యాణ్ చర్చల్లో పాల్గొంటామన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషి అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి బాగా వెళ్లాలన్నారు.
అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు..
శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీపాలు ఘటనలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించామని, ఈ రెండు ఘటనలను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుందని, ఇలాంటి ఘటనలు ఎట్టిపరిస్థితుల్లో పునరావతృం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 28నే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామని.. వీటి పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని, అందకు అనుగుణంగా 28న అసెంబ్లీకి సెలవు ప్రకటించాలని పయ్యావులను సీఎం కోరారు. కాగా.. ఎజెండాలోని అంశాల్లో.. హెరిటేజ్ కంపెనీతోపాటు 10 కంపెనీల విస్తరణకు స్థల కేటాయింపులు కూడా ఉన్నాయి. ఈ కేటాయింపులకు సంబంధించిన అంశాలు క్యాబినెట్‌లో చర్చకు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమావేశం నుంచి వెళ్లిపోయారు.