‘నో స్టాక్’ బోర్డులు కనిపించొద్దు!
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:15 AM
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కష్టాలపై సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. ఆదివారం ఉదయం ముంబై నుంచి ఒకసారి, రాష్ట్రానికి చేరుకున్న తర్వాత తన క్యాంపు కార్యాలయం నుంచి మరోసారి...
నేటిలోగా పెట్రోల్, డీజిల్ సరఫరా పెంచాలి
ఎక్కడా బ్లాక్‌లో అమ్మకాలు జరగకూడదు
ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు రానీయొద్దు: సీఎం
సమస్య పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్
ఉన్నట్టుండి ‘క్రెడిట్’ విధానం మార్చేస్తే ఎలా?
ఆయిల్ కంపెనీల తీరుపై ముఖ్యమంత్రి అసహనం
రాష్ట్రంలో 421 బంకులే మూతపడ్డాయి: అధికారులు
‘‘రాష్ట్రంలో సోమవారం నాటికి డిమాండ్‌కు తగ్గట్టుగా పెట్రోలు, డీజిల్ సరఫరా ఉండాలి. ఎక్కడా కొరత లేకుండా తక్షణ చర్యలు తీసుకోండి. ఎక్కడా బ్లాక్ మార్కెట్ జరగొద్దు. అయినా మూడు రోజుల క్రితమే సమస్యను గుర్తించామని చెబుతున్న అధికారులు.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? సమస్య తలెత్తిన తర్వాత నాకు నివేదికలు ఇవ్వడం కాదు, పనిచేసి ఫలితాలు చూపించండి.’’
‘‘ఆయిల్ కంపెనీలు రిటైల్ ఔట్‌లెట్లకు ఉన్నట్టుండి ‘క్రెడిట్’ సదుపాయం నిలిపివేస్తే ఎలా? ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతులపై పునరాలోచన చేస్తాం. ఆయిల్ కంపెనీల అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సహించేది లేదు.’’
- సీఎం చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కష్టాలపై సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. ఆదివారం ఉదయం ముంబై నుంచి ఒకసారి, రాష్ట్రానికి చేరుకున్న తర్వాత తన క్యాంపు కార్యాలయం నుంచి మరోసారి సీఎస్ సాయిప్రసాద్, ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌లో వరుస సమీక్షలు నిర్వహించారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండేలా చూడాలని.. ఇంధన సంక్షోభం తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, సోమవారం నాటికి ఎక్కడా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దన్నారు. ఎక్కడా బ్లాక్‌లో పెట్రోలు, డీజిల్ అమ్మకాలు జరగడానికి వీల్లేదని చెప్పారు. రిటైలర్లకు క్రెడిట్ విషయంలో ఉన్నట్టుండి పాలసీ మార్చడం ఏంటని ఆయిల్ కంపెనీల ప్రతినిధులను నిలదీశారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొనే వరకు రెవెన్యూ, పోలీసు, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోండి
ముందుగా ‘బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకొనేందుకు శనివారం ముంబై వెళ్లిన ఆయన.. తిరిగి ఏపీకి బయల్దేరే ముందు ఆదివారం ఉదయం అక్కడి నుంచే సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సమస్యపై సాయంత్రంలోగా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,510 పెట్రోలు బంకులు (అవుట్ లెట్లు) ఉండగా... వాటిల్లో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా 421 బంకులు మూతపడ్డాయని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఇంధన సరఫరా గతంలో కంటే పెరిగినా.. వాహనదారుల ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా అకస్మాత్తుగా డిమాండ్ పెరిగిందన్నారు. ఆయిల్ సంస్థలు శనివారం 10,345 కిలో లీటర్ల పెట్రోల్, 14,156 కిలో లీటర్ల డీజిల్‌ను సరఫరా చేసినట్లు చెప్పారు. ఇంధన కొరత ఉందన్న భయాందోళనలతో వాహనదారులు పెట్రోలు బంకుల దగ్గర బారులు తీరుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆక్వా రైతులు డ్రమ్ముల్లో కొనుగోళ్లు జరుపుతారని, వారికి పెట్రోలు, డీజిలు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందని వివరించారు.
వాణిజ్య వినియోగదారుల కొనుగోళ్ల వల్లే..
తర్వాత రాష్ట్రానికి చేరుకున్న వెంటనే సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి మరోసారి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రిటైల్ ఔట్‌లెట్ల దగ్గర వాణిజ్య వినియోగదారులు కొనుగోళ్లు జరపడం వల్లే సమస్య తలెత్తిందని అధికారులు వివరించారు. సాధారణ రోజులతో పోలిస్తే శనివారం ఒక్కసారిగా 34 శాతం డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఆదివారం కూడా 22 శాతం అధికంగా డిమాండ్ ఉందని తెలిపారు. డీజిల్ అమ్మకాలు సాధారణ పరిస్థితులతో (రోజుకు 9,048 కిలోలీటర్ల అమ్మకాలు) పోలిస్తే.. శనివారం 16 శాతం డిమాండ్ (10,556 కిలో లీటర్లు) పెరిగిందని, ఆదివారం కూడా 3 శాతం అధికంగా ఉందని చెప్పారు. నయారా, రిలయెన్స్, జియో తదితర ప్రైవేట్ కంపెనీలు తమ బంకులకు ఇంధన సరఫరాను పూర్తిగా నిలిపివేయడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని కలెక్టర్లు సీఎంకు చెప్పారు. గురువారమే సమస్యను గుర్తించామని అధికారులు చెప్పగా.. సీఎం మరింత సీరియస్ అయ్యారు. 3 రోజుల క్రితమే గుర్తించినప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికలివ్వడం కాదని, ఫలితాలు చూపించాలని చురకలంటించారు.
రైతులకు కూపన్ విధానాన్ని పరిశీలించండి
వ్యవసాయం, ఆక్వా రంగాలకు డీజిల్ అవసరాలు పెరిగాయని, ప్రస్తుత రబీ సీజన్‌లో వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టి, డీజిల్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్కసారిగా ఇంధన సమస్య తలెత్తడంపై విచారణ జరపాలని ఆదేశించారు. ప్రతి పెట్రోలు బంక్ దగ్గర రెవెన్యూ, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు.
బ్లాక్ మార్కెటింగ్‌ను ఉపేక్షించొద్దు: మంత్రి నాదెండ్ల
మరోవైపు రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, ఒక్కసారిగా పెరిగిన ప్యానిక్ కొనుగోళ్ల వల్లే ఇబ్బందులు వచ్చాయని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్ నుంచి సివిల్ సప్లయిస్ కమిషనర్ కన్నబాబు, అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాహనదారులు, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు, అపోహలను తొలగించేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో రోజువారీగా అందుబాటులో ఉన్న డీజిల్, పెట్రోలు నిల్వల పరిస్థితిని జేసీలు, డీఎ్‌సవోలు మీడియా ద్వారా వెల్లడించాలని ఆదేశించారు. కొన్ని చోట్ల పెట్రోలు బంకుల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టించి.. డీజిల్, పెట్రోలును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిని ఉపేక్షించవద్దని, కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రస్తుతం రబీ పంటల కోతలు, ఆక్వా పట్టుబడులు కొనసాగుతున్నందున రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా.. డీజిల్, పెట్రోల్ సమస్యకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. సీఎం చంద్రబాబు సమీక్షలకే పరిమితం కావడం సరికాదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.