Share News

అమరావతి వ్యయంపై దుష్ప్రచారం

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:43 AM

రాజధాని అమరావతి నిర్మాణం కోసం భారీగా వ్యయం చేస్తున్నామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో..

అమరావతి వ్యయంపై దుష్ప్రచారం

  • సైబరాబాద్‌ నిర్మాణ సమయంలోనూ ఇలాగే అన్నారు

  • హైదరాబాద్‌ను విస్తరించాలని నన్నెవరూ కోరలేదు

  • ఇప్పుడు అత్యంత ఉల్లాస నగరంగా మారింది

  • తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరైంది

  • అమరావతి నిర్మాణానికి భూములు కొనలేదు

  • రూపాయి చెల్లించకుండా భూసమీకరణ

అమరావతి వాస్తు అత్యద్భుతం. ఈ నగరానికి పౌరాణిక చరిత్ర ఉంది. అందుకే ప్రధాని మోదీ దానికి శంకుస్థాపన చేసి మళ్లీ ఆయనే పునర్నిర్మాణానికి వచ్చారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐబీఎం క్వాంటమ్‌ కంప్యూటర్‌ను తీసుకురావాలనుకున్నాం. ఈ ఆలోచనను ప్రధాని మోదీ ముందుంచగానే.. సంపూర్ణ సహకారం అందించారు. సాంకేతికత విషయంలో ఆయన ముందుంటారు.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణం కోసం భారీగా వ్యయం చేస్తున్నామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో మంగళవారం క్వాంటమ్‌ టెస్ట్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం భారీగా నిధులు ఖర్చు పెడుతున్నారని వస్తున్న ఆరోపణలను విలేకరులు ప్రస్తావించారు. ఇదంతా దుష్ప్రచారమేనని ఆయన కొట్టివేశారు. సైబరాబాద్‌ నగర నిర్మాణాన్ని చేపట్టినప్పుడూ రాష్ట్ర నిధులన్నీ అక్కడే ఖర్చు పెట్టేస్తున్నానని నిందలు వేశారని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీ సీఎంగా 25 ఏళ్ల కిందట హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలను విస్తరించాలని నిర్ణయించానని చెప్పారు. అయితే విస్తరించాలని తననెవరూ కోరలేదన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌ అత్యంత ఉల్లాసంగా నివసించే నగరంగా ఉందని.. ఆదాయం లక్ష కోట్లు దాటిందని.. తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు.


అమరావతి కూడా అదేతరహాలో స్వయం సమృద్ధి నగరంగా మారుతుందని ధీమా వ్యక్తంచేశారు. ‘హైదరాబాద్‌లో నిజాం నవాబులు అందించిన రాళ్ల గుట్టలతో కూడిన భూములు అప్పట్లో అందుబాటులో ఉండేవి. హైటెక్‌ సిటీ నిర్మాణం కోసం ఎల్‌ అండ్‌ టీ వెళ్లినప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలే లేవు.. రోడ్లు లేవు.. పాములు తిరిగేవి. ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ నిర్మాణ సమయంలో రాత్రిళ్లు అక్కడ ఉండేందుకు భయపడేవారు. ఆ హైటెక్‌ సిటీ నిర్మాణమే ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థలను అక్కడకు వచ్చేలా చేసింది’ అని తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం భూములు కొనలేదని.. ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో 29,000 మంది రైతుల నుంచి 33,000 ఎకరాలు సమీకరించామని చెప్పారు.‘భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తే గృహనిర్మాణాలు జరుగుతాయి. అర్థిక లావాదేవీలూ పెరుగుతాయి. జీఎస్టీ వంటి పన్నులతో ప్రభుత్వానికి రాబడి వస్తుంది. ఇలాంటి నగరం దేశంలో మరెక్కడా ఉండదు.’ అని తెలిపారు.


క్వాంటమ్‌ వ్యాలీకి త్వరలోనే మేధావులు, నిపుణులు

అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి విదేశాల్లోని మేధావులు, నిపుణులు త్వరలోనే రానున్నారని చంద్రబాబు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని గుర్తిస్తామని.. ఐబీఎం, వైజర్‌ వంటి సంస్థలు వారికి క్వాంటమ్‌ నైపుణ్యాలను అందిస్తాయన్నారు. సాంకేతిక విద్యతో పాటు.. బీఏ, బీఎస్సీ, బీకాంలాంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులూ క్వాంటమ్‌ నైపుణ్య ం పెంచుకునేలా పాఠ్యాంశాలను రూపొందిస్తామని తెలిపారు. ఏపీ విద్యార్థుల్లో లౌకిక జ్ఞానమెక్కువని ప్రశంసించారు. టెక్నాలజీలో మీరే నాయకుడని మీడియా ప్రతినిధులు అనగా.. టెక్నాలజీలో లీడర్‌ ప్రధాని మోదీయేనని సీఎం బదులిచ్చారు.

సీఆర్‌డీఏ కేంద్ర బిందువు

అమరావతి అభివృద్ధికి సీఆర్‌డీఏ కేంద్ర బిందువుగా ఉంటుందని సీఎం అన్నారు. అమరావతిలో విజయవాడ కార్పొరేషన్‌, గుంటూరు కార్పొరేషన్‌, మంగళగిరి కార్పొరేషన్‌ ఉంటాయని.. ఈ నగరం హనుమాన్‌ జంక్షన్‌ దాకా విస్తరిస్తుందని చెప్పారు. సీడ్‌ క్యాపిటల్‌, క్యాపిటల్‌ సిటీ, అమరావతి రీజియన్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ భవన నిర్మాణాలు పూర్తి చేస్తామని.. రహదారులు, మురుగునీటి కాలువలు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. విశాఖలో ఈనెల 28న గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. అదేదారిలో మరిన్ని సంస్థలు రానున్నాయని చంద్రబాబు తెలిపారు.

Updated Date - Apr 15 , 2026 | 04:44 AM