Share News

Sankranti Celebrations: సొంతూరులో బాబు

ABN , Publish Date - Jan 14 , 2026 | 04:27 AM

నిత్యం ఇటు పార్టీ కార్యకలాపాలు, అటు పాలనా కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే సీఎం చంద్రబాబు మంగళవారం దానికి భిన్నంగా కనిపించారు.

Sankranti Celebrations: సొంతూరులో బాబు

  • నారావారిపల్లెలో సంక్రాంతి ముందస్తు వేడుకల్లో పాల్గొన్న సీఎం దంపతులు

  • కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సందడి

  • మహిళలకు ముగ్గులు, పిల్లలకు ఆటల పోటీలు

  • రూ. 150 కోట్ల అభివృద్ధి పనులకు

  • ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

తిరుపతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): నిత్యం ఇటు పార్టీ కార్యకలాపాలు, అటు పాలనా కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే సీఎం చంద్రబాబు మంగళవారం దానికి భిన్నంగా కనిపించారు. సంక్రాంతి నేపథ్యంలో కుటుంబంతో కలసి స్వగ్రామంలో సేదదీరారు. నేతలతో పాటు ఆప్తులనూ కలిసి పలకరించారు. సతీమణి, కుమారుడు, కోడలు, మనవడు, ఇతర బంధువులతో కలసి ఉత్సాహంగా సంక్రాంతి ముందస్తు వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసానికి సోమవారం రాత్రి చంద్రబాబు చేరుకున్నారు. మంగళవారం ఉదయం అక్కడి టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు సంక్రాంతి సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే ముగ్గులు వేశారు. చంద్రబాబు ఆ ముగ్గులను పరిశీలించి, మహిళలు, యువతులను అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే చంద్రబాబు నివాసం ఎదుట మైదానంలో పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. సీఎం దంపతులు, మంత్రి లోకేశ్‌ దంపతులు, ఇతర సన్నిహిత బంధువులు పోటీలను పరిశీలించారు. బ్యాలెన్స్‌ వాకింగ్‌, కోడి పందేలు(కత్తిలేని), త్రీ లెగ్‌ రేస్‌, గ్లాస్‌ అండ్‌ బెలూన్‌ రన్‌, పొటాటో గేదరింగ్‌, గన్నీ బ్యాగ్‌ రేస్‌, మ్యూజికల్‌ చెయిర్స్‌, లెమన్‌ అండ్‌ స్పూన్‌, టెయిల్‌ పికింగ్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌ వంటి పోటీలలో చుట్టుపక్కల గ్రామాల స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి సీఎం దంపతులు బహుమతులు ప్రదానం చేశారు.


ప్రారంభోత్సవాలు

సీఎం చంద్రబాబు తన స్వగ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేశారు. నారావారిపల్లె సమీపంలోని మూ లపల్లి చెరువును సందర్శించారు. అక్కడ నీవా బ్రాంచి కెనాల్‌ నుంచి మూలపల్లి చెరువు సహా నాలుగు చెరువుల మీదుగా కల్యాణి డ్యామ్‌కు కృష్ణా జలాలను మళ్లించి పొలాలకు సాగునీటితో పాటు తిరుపతి, తిరుమల తాగునీటి అవసరాలు తీర్చేలా రూ.126 కోట్లతో చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నారావారిపల్లిలో 30 పడకల నుంచి 50 పడకల స్థాయికి పెంచిన ప్రభుత్వ ఆస్పత్రిని, రూ.4.27 కోట్లతో నిర్మించిన 33-11 కేవీ సెమీ ఇండోర్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను, రూ.1.40 కోట్లతో నిర్మించిన స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ భవనాన్ని, రూ.77 లక్షలతో శేషాచల లింగేశ్వరాలయానికి నిర్మించిన సిమెంట్‌ రోడ్డును ప్రారంభించారు. అలాగే, తిరుపతి రుయా ఆస్పత్రిలో నిర్మించిన రోగుల సహాయకుల వసతి భవనానికి, ఎస్వీయూలో రూ.7.50 కోట్లతో నిర్మించిన పురుషుల హాస్టల్‌ను, రూ. 5 కోట్లతో నిర్మించిన మహిళల హాస్టల్‌ను కూడా ప్రారంభించారు. రూ.10 లక్షలతో పాడి ఆవులకు వసతి కేంద్రం నిర్మాణానికి, ఎస్వీయూలో రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్‌ ల్యాబ్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

మనవడి ఆటలతో మురిసిన చంద్రబాబు దంపతులు

మంత్రి లోకేశ్‌ దంపతుల కుమారుడు నారా దేవాన్ష్‌ ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఎంపీ భరత్‌ దంపతుల కుమారుడు ఆర్యవీర్‌ కూడా స్కూలు పిల్లలతో కలిసి ఆటలు ఆడాడు. వీరిద్దరూ పోటీలలో పాల్గొనడం చూసి సీఎం దంపతులు మురిసిపోయారు. నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి కుటుంబీకులు, సీఎం సోదరుడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 06:34 AM