Naravari Palle: నారావారిపల్లెకు పండుగ కళ.. అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:12 AM
రుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి బుధవారం భోగి సంబరాలు నిర్వహించారు.
స్వగ్రామంలో భోగి వేడుకల్లో చంద్రబాబు
తిరుపతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి బుధవారం భోగి సంబరాలు నిర్వహించారు. తెల్లవారుజామునే భోగి మంటలు వెలిగించి వేడుకలో పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను సతీమణి భువనేశ్వరితో కలసి తిలకించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నారావారిపల్లెకు చేరుకుని సీఎంకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాలనుంచి పెద్దఎత్తున వచ్చిన ప్రజల నుంచి మంత్రి లోకేశ్ ఫిర్యాదులు స్వీకరించారు. తిరుపతిలోని శెట్టిపల్లె భూ సమస్యకు పరిష్కారం చూపినప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు బాధితులు నారావారిపల్లెకు చేరుకున్నారు. ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సాయంత్రం 5గంటలు దాటినా సీఎం నివాసం వద్దకు పెద్దఎత్తున వస్తున్న ప్రజలను గురువారం రావాలని అధికారులు పంపేశారు. కాగా, సంక్రాంతి సందర్భంగా గురువారం చంద్రబాబుతో పాటు కుటుంబసభ్యులు నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తన తల్లిదండ్రులు నారా ఖర్జురపు నాయుడు, అమ్మణమ్మల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు అర్పించి, స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని తిరుగుప్రయాణం కానున్నారు.
