పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచాలి
ABN , Publish Date - May 16 , 2026 | 05:04 AM
దేశంపై చమురు దిగుమతుల భారం తగ్గేలా.. పెట్రోలులో ఇథనాల్ మిశ్రమం పెంపుపై సీఎం చంద్రబాబు మరోమారు కేంద్రంతో మాట్లాడారు.
ఏపీ మొక్కజొన్న రైతులకు మేలు.. కేంద్రమంత్రికి సీఎం ఫోన్
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): దేశంపై చమురు దిగుమతుల భారం తగ్గేలా.. పెట్రోలులో ఇథనాల్ మిశ్రమం పెంపుపై సీఎం చంద్రబాబు మరోమారు కేంద్రంతో మాట్లాడారు. శుక్రవారం కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురికి ఫోన్‌చేసి, పెట్రోలులో ప్రస్తుతం 20 శాతం ఇథనాల్ కలుపుతుండగా, దీనిని 40 శాతానికి పెంచేలా చూడాలని కోరారు. బ్రెజిల్ వంటి దేశాల్లో ఇథనాల్ మిశ్రమం అత్యధిక స్థాయిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇథనాల్ మిశ్రమం శాతం పెరిగితే పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇథనాల్ తయారీ వల్ల చెరకు, మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని చెప్పారు. కేంద్రం తీసుకునే నిర్ణయం వల్ల ఏపీలో మొక్కజొన్న రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోనూ చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు.