అన్న.. దాతా సుఖీభవ!
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:22 AM
చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం అందించడంతో పేదలు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు క్వాంటీన్ల వద్ద ఉదయం 11 గంటలకే అన్నార్థులు బారులు తీరారు.
బాబు బర్త్‌డే సందర్భంగా ఉచిత వితరణ
పేదలతో కిక్కిరిసిపోయిన అన్న క్యాంటీన్లు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం అందించడంతో పేదలు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు క్వాంటీన్ల వద్ద ఉదయం 11 గంటలకే అన్నార్థులు బారులు తీరారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని అన్న క్యాంటీన్‌లో విడి రోజుల్లో 300 మంది మధ్యాహ్నం భోజనం చేస్తారు. సోమవారం మరో వంద మందికి అదనంగా వడ్డించారు. చాలా క్యాంటీన్లలో ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో పలు చోట్ల భోజనం అయిపోయిందంటూ బోర్డులు కనిపించాయి. శ్రీకాకుళం తోపాటు.. పలాస కాశీబుగ్గ, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, టెక్కలి, కోటబొమ్మాళి, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో సుమారు పదివేల మందికిపైగా అల్ఫాహారం, భోజనం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం కేంద్రంలోని అన్న క్యాంటీన్‌లో పేద ప్రజలకు అన్నం వడ్డించారు. బాపట్ల జిల్లా రేపల్లె అన్న క్యాంటీన్ వద్ద ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి కేక్ కట్ చేశారు. విశాఖ జీవీఎంసీ పరిధిలోని 25 అన్న క్యాంటీన్లలో సోమవారం అదనంగా పదిహేను వేల మంది ఆహారం తీసుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సందర్శించి పేదలకు ఉచిత భోజనం అందించారు. అనంతపురం జిల్లాలోని 11 అన్న క్యాంటీన్లలో సాధారణ రోజుల్లో 18 వేల మంది భోజనం చేస్తుంటారు. కానీ సోమవారం మధ్యాహ్నం వరకూ ఏకంగా 30 వేల మంది భోజనాలు చేశారు. పెనుకొండలో అన్న క్యాంటీన్‌ను మంత్రి నవిత, ఎంపీ బీకే పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారభించారు. కాకినాడలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పెద్దాపురంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తుని ఎమ్మెల్యే దివ్య క్యాంటీన్లను సందర్శించి.. పేదలకు భోజనం అందించారు.