Share News

పారిశ్రామికవేత్తలుగా బీసీలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:08 AM

వెనుకబడిన వర్గాలను మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బుధవారం బీసీ సంక్షేమశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు.

పారిశ్రామికవేత్తలుగా బీసీలు

  • తగిన కార్యాచరణ రూపొందించండి

  • అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం

  • బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష

  • ఆదరణ-3 ద్వారా ఆధునిక పరికరాలు

  • 60 కోట్ల సాస్కీ నిధులతో గురుకుల స్కూళ్లు, హాస్టళ్లు: సీఎం

అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన వర్గాలను మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బుధవారం బీసీ సంక్షేమశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆదరణ పథకం-3 ద్వారా కులవృత్తుల వారీగా ఆధునిక పరికరాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రూ.60 కోట్ల సాస్కీ నిధులతో రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. 814 బీసీ సంక్షేమ హాస్టళ్లలో రూ.17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. శానిటేషన్‌తో పాటు విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాబోధన సహా అన్ని అంశాల్లోనూ ఉత్తమ ఆచరణీయ మార్గాలను అనుసరించాలని, విద్యాపరమైన అంశాల పర్యవేక్షణకు అపార్‌ ఐడీలను నమోదు చేసి అనుసంధానం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న బీసీ భవనాలను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఆరు మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్‌ స్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా మార్చాలని ఆదేశించారు. బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో నెట్‌ జీరో కాన్సెప్ట్‌ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు. బీసీ స్టడీ సర్కిళ్లను తదుపరి స్థాయికి తీసుకునేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. బీసీలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, వారికి ప్రయోజనం కలిగేలా పథకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

Updated Date - Feb 05 , 2026 | 04:09 AM