Share News

రెండేళ్లలో 5 వేల ఆలయాల నిర్మాణం

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:07 AM

శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న ఐదు వేల దేవాలయాలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రెండేళ్లలో 5 వేల ఆలయాల నిర్మాణం

  • టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు

  • దేవదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న ఐదు వేల దేవాలయాలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం సచివాలయంలో దేవదాయ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి కమిటీ వేయాలని సూచించారు. శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించామన్నారు. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యతను జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 25-30 ఆలయాలు నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణం చేపట్టాలన్నారు. వీటి నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ దేవాలయానికి ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. ‘రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. ప్రస్తుతం సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్‌ ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన దేవాలయాలకు కూడా మాస్టర్‌ ప్లాన్‌లను త్వరితగతిన రూపొందించాలి. వీటి ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్‌ నిర్వహణ, పార్కింగ్‌, నివాస సౌకర్యాలు, పరిశుభ్రత వంటివి కల్పించాలి. దేవాలయాల్లో పవిత్రతోపాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలి. దేవాలయాలకు భక్తుల సందర్శన పెద్ద ఎత్తున పెరుగుతోంది. ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆ శాఖపైనే ఉంది’ అని సీఎం చెప్పారు.


తిరుమల తరహాలో అన్నప్రసాదం

రాష్ట్రంలోని 111 దేవాలయాల్లో అన్న ప్రసాదాన్ని అందిస్తుండగా, 65 దేవాలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నామని సీఎం తెలిపారు. తిరుమల తరహాలోనే ఇతర దేవాలయాల్లోనూ అన్నప్రసాదం అందించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని దేవాలయాల్లో రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందుతోందన్నారు. దీని కోసం ఏడాదికి రూ.157.85 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఆయా దేవాలయాల పాకశాలల్లో పనిచేసే వారికి శిక్షణ ఇప్పించాలని, దేవాలయాల్లో కామన్‌ గుడ్‌ ఫండ్‌ ద్వారా జరుగుతున్న పనులను త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. సీజీఎఫ్‌ నిధులతో చేపట్టే దేవాలయాల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రధాన ఆలయాల్లో వాట్సాప్‌ ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందేలా చూడాలన్నారు. ఆగమ సలహా మండలి, ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌, స్టాండింగ్‌ కౌన్సిల్‌ నియామకాన్ని త్వరిగతిన చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దేవాలయాల పాలక మండళ్లను వెంటనే నియమించాలని సీఎం సూచించారు.

టెంపుల్‌ టూరిజం..

ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రమోట్‌ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. అన్ని దేవాలయాల వద్ద వసతి సౌకర్యాలు మెరుగవ్వాలని, ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. దీనికోసం టెంపుల్‌ టౌన్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలన్నారు. భక్తుల రద్దీ నియంత్రణ విషయంలో టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలన్నారు. దేవాలయాల భూముల రక్షణకు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీని వినియోగించాలని చెప్పారు. ఈవోలు బదిలీలపై వెళ్లే సమయంలో కొత్తగా వచ్చే అధికారులకు ముఖ్యమైన వివరాలను అందించి వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కార్యదర్శి హరిజవహర్‌లాల్‌, కమిషనర్‌ రామచంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 04:07 AM