Share News

పనిచేసే వాళ్లకే పదవులు

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:13 AM

పార్టీ కోసం పని చేసే వాళ్లకే పదవులు ఇస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్లకే ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

పనిచేసే వాళ్లకే పదవులు

  • అలాంటి వారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం: చంద్రబాబు

  • కార్యకర్తలను దూరం పెట్టే నేతలు మాకొద్దు

  • కష్టపడేవారిని గుర్తించే బాధ్యత లోకేశ్‌దే

  • అమరావతి దేవతల రాజధాని.. అది కొందరు రాక్షసులకు ఇష్టం లేదు

  • ఇక మూడు ముక్కలాటకు తావులేదు

  • ఆర్థికంగా ఇబ్బందులున్నా కార్యకర్తలు కాలర్‌ ఎగరేసేలా పాలన అందిస్తున్నాం

  • చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికీ వివరించాలి

  • ప్రతి ఎన్నికల్లో కూటమి గెలవాలి

  • టీడీపీ ఆవిర్భావ సభలో సీఎం స్పష్టీకరణ

ఈసారి 50 శాతం సీట్లు పెరగనున్నాయి. 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. పార్టీ కోసం ఎవరు బాగా పనిచేస్తే వారే ప్రజాప్రతినిధులవుతారు.

- టీడీపీ అధినేత చంద్రబాబు

వైసీపీ తప్పుడు ప్రచారాలను పార్టీ తిప్పికొట్టాలి. నిత్యం ప్రజల్లో ఉండాలి. చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికీ వివరించాలి. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ఎన్డీయే గెలవాలి.

- టీడీపీ అధినేత చంద్రబాబు

అమరావతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం పని చేసే వాళ్లకే పదవులు ఇస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్లకే ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలను దూరం పెట్టే నేతలను తానూ దూరం పెడతానన్నారు. కార్యకర్తలను పట్టించుకోని నేతలు తనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. కష్టపడే కార్యకర్తలను, నేతలను గుర్తించే బాధ్యత లోకేశ్‌దేనని చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. వ్యక్తిగత ప్రవర్తన మొదలుకొని ప్రతి అంశంలో టీడీపీ బ్రాండ్‌ నిలిపేలా వ్యవహరించాలని సూచించారు. ప్రజలతో మమేకం కావాలని.. సమస్యలు పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

Untitled-2 copy.jpg


కార్యకర్తే అధినేత

కార్యకర్తల వల్లే మనం ఇక్కడ ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలు, మంత్రులైన వాళ్లు దీనిని బాగా అర్ధం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలకు, విధానాలకు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. రికార్డులు బద్దలు కొట్టేలా విజయం సాధించాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కార్యకర్తలు కాలర్‌ ఎగరేసేలా పాలన అందిస్తున్నాం. దేశంలో ఎవరూ ఇవ్వని స్థాయిలో సామాజిక పెన్షన్లు ఇస్తున్నాం. సూపర్‌ సిక్స్‌ పథకాలను సూపర్‌ హిట్‌ చేశాం. డీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాలు కల్పించాం. తాజాగా 10 వేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చాం. ఇప్పటికే 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చాం. చెప్పినట్లుగా ఒక్క పైసా కూడా పెంచలేదు. పైగా ట్రూ అప్‌ నుంచి ట్రూ డౌన్‌ చేశాం. ఈ ఏడాది కూడా కరెంటు చార్జీలు పెంచం. అమరావతిలో మొదట ప్రారంభించిన పనులను 2028 ఆగస్టుకు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తాం. అమరావతి దేవతల రాజధాని కాబట్టి కొందరు రాక్షసులకు ఇష్టం లేదు. ఇక మూడు ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అదే అమరావతి.

Untitled-3 copy.jpg


టీడీపీ బలంగా ఉంటేనే..

అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు. టీడీపీ బలంగా ఉంటేనే.. రాష్ట్రం బలంగా ఉంటుంది. పార్టీ గెలుపే రాష్ట్రం గెలుపు. పసుపు జెండా నిరంతరం ఎగరాలి. గతం.. వర్తమానం.. భవిష్యత్‌ టీడీపీవే. పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు అన్నీ సంచలనమే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి రాజకీయాలు చేస్తోంది. నాయకత్వం పెంపు కోసం నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ మనదే. కార్యకర్తలకు రాజకీయ సాధికారత కల్పిస్తాం. అన్ని పదవుల్లోనూ జనాభా దామాషా పద్ధతిలో అవకాశాలు కల్పిస్తాం. కార్యకర్తలకు ఆర్థిక సాధికారత కల్పిస్తాం. న్యాయబద్ధమైన సంపాదన వచ్చేలా సహకరిస్తాం.

విజయాలు చూశాం.. సంక్షోభాలూ చూశాం

తెలుగుదేశం పార్టీ విజయాలనే కాదు సంక్షోభాలను.. సవాళ్లనూ చూసింది. ఎంతోమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆస్తులు కోల్పోయారు. నిద్రలేని రాత్రులు గడిపారు. టీడీపీని ఫినిష్‌ చేస్తామని ఆలోచన చేసిన వారే ఫినిష్‌ అయ్యారు. గత ప్రభుత్వ విధ్వంసంపై లోకేశ్‌ యువగళం పాదయాత్ర చేపడితే దాన్ని కూడా అడ్డుకున్నారు. కార్యకర్తల అండతో అడుగు ముందుకే వేశాడు. నన్ను కూడా జైల్లో పెట్టారు. ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి ఈ అధికారం.. అంతా కార్యకర్తల త్యాగాలు, కష్టం వల్లే. వారి సంక్షేమం కోసం ట్రస్టు ద్వారా వేల మందికి ఉచిత విద్య అందిస్తున్నాం. పనిచేసిన వాళ్లకు గుర్తింపు ఉంటుంది. కష్టపడిన వాళ్లకు పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తాం. తోట చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం.


కృష్ణా నదిలో పడవల ర్యాలీ

తాడేపల్లి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా నదిలో పార్టీ జెండాలతో పడవల ర్యాలీ నిర్వహించారు. బోటింగ్‌ సొసైటీ ప్రతినిఽధులు ఉండవల్లి, కరకట్ట పాత ఇసుక క్వారీ నుంచి పది భారీ ఇసుక బోట్లు, 20 మరపడవలను పార్టీ జెండాలతో అలంకరించి నదిలో 3 కిలోమీటర్ల మేర మూడు గంటల పాటు ర్యాలీ చేశారు. పడవలపై టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. కరకట్ట వెంబడి ప్రయాణించే ప్రయాణికులు, వాహన చోదకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో వీక్షిస్తూ వారిని ఉత్సాహపరిచారు. అనంతరం బోట్ల ర్యాలీ ప్రకాశం బ్యారేజి వరకు చేరుకుని తిరిగి పాత ఇసుక క్వారీ వరకు సాగింది. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు దేవినేని సదాశివరావు, కేళి వెంకటేశ్వరరావు, మానికొండ ఉదయభాస్కర్‌, కరుణాకర్‌, సుబ్బారావు, సురేష్ బాబు, వంశీ, టీడీపీ మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ, గాదె బసివిరెడ్డి, నరేంద్ర, పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Untitled-3 copy.jpg

Updated Date - Mar 30 , 2026 | 05:52 AM