ప్రతి ఒక్కరికీ 2.5 లక్షల ఆరోగ్య బీమా
ABN , Publish Date - Mar 01 , 2026 | 04:55 AM
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా అందించనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
తుది దశలో కసరత్తు.. త్వరలో ప్రకటిస్తాం
గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉచిత వ్యాక్సిన్
పోలవరం నీళ్లు వంశధారకు తీసుకొస్తా
జగన్ హయాంలో టీటీడీ పవిత్రతకు దెబ్బ
నాటికి, నేటికి ‘లడ్డూ’లో తేడా భక్తులే చెబుతున్నారు
విజయనగరం జిల్లా పర్యటనలో చంద్రబాబు
చేతల్లో మా అభివృద్ధి: లోకేశ్
బ్లూ జెట్ హెల్త్‌కేర్ ఫార్మా కంపెనీకి భూమి పూజ
విజయనగరం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా అందించనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావివలసలో శనివారం జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బీమా పథకానికి సంబంధించి విధివిధానాలు తయారుచేశామని, తుది కసరత్తు జరుగుతోందని, త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. పేదవారు ఎక్కడుంటే తాను అక్కడుంటానని, పేదరికం నిర్మూలనే లక్ష్యంగా సంస్కరణలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. పేదరికం నిర్మూలనకే సూపర్ సిక్స్ పథకాలు అని తెలిపారు. 1న సెలవు దినం వస్తే ముందురోజే పింఛన్లు అందించి, చిత్తశుద్ధి నిలుపుకొంటున్నట్టు చెప్పారు. ‘‘గర్భాశయ క్యాన్సర్‌లు ప్రమాదకరంగా మారుతున్నాయి.
ఏపీలో 3,40,154 మందికి ఈ రకమైన రుగ్మతలు ఉన్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం 14, 15 ఏళ్ల బాలికలకు రూ.4,400 విలువచేసే వ్యాక్సిన్‌ను రూ.400కే అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తోంది. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. త్వరలో వాట్సాప్ ద్వారా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరికి వారుగా తమ ఆరోగ్య పరిస్థితిని, వివరాలను తెలుసుకోవచ్చు. ఏపీని గంజాయి లేని రాష్ట్రంగా మార్చుతాం. గంజాయి మాఫియాను ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఫ్యాక్షనిజాన్ని అణిచివేశాం.’’ అని సీఎం తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
నదుల అనుసంధానం..
‘‘నదుల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పోలవరం నీటిని వంశధారకు తీసుకురావాలన్నదే మా లక్ష్యం. ఇప్పటికే పోలవరం నీరు అనకాపల్లి వరకూ వచ్చింది. దాన్ని శ్రీకాకుళం వరకూ తీసుకెళతాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నీరు అందించాలన్నదే లక్ష్యం. రాష్ట్ర బడ్జెట్‌లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి పెద్దపీట వేశాం. తిరుమల ప్రతిష్ఠను, పవిత్రతను గత వైసీపీ ప్రభుత్వం మంటగలిపింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. నాణ్యత లేని నెయ్యితో లడ్డూ తయారుచేసి పాపాన్ని మూటగట్టుకున్నారు. వారిని దేవదేవుడు అస్సలు క్షమించడు.
వైసీపీ హయాంలో టీటీడీ లడ్డూకు.. ఇప్పుడు తయారవుతున్న లడ్డూకు చాలా వ్యత్యాసం ఉందని భక్తులే చెబుతున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను 2047 విజన్‌తో పనిచేస్తున్నా. గతంలో ఐటీ అభివృద్ధి చేశా. ఇప్పుడు ఏఐకి ప్రాధాన్యం ఇస్తున్నా. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆదరించాలి’’ అని చంద్రబాబు కోరారు. మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కళా వెంకటరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులులేని అక్కాచెల్లెళ్లకు సీఎం చంద్రబాబు అండ
చీపురుపల్లి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఇద్దరు అక్కా చెల్లెళ్లకు సీఎం చంద్రబాబు అండగా నిలిచి పెద్ద మనసు చాటుకున్నారు. చీపురుపల్లి మండలం రేగిడిపేటకు చెందిన రేగిడి హారిక, అఖిల పేరున చెరో 3లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నట్టు ప్రకటించారు. పీ4లో భాగంగా గరివిడి మండలం కొండదాడి గ్రామానికి చెందిన మార్గదర్శి పి.సాయి గోపాలవర్మ... వారిని దత్తత తీసుకుని చదివిస్తున్నారు. ఆయన్ను సీఎం అభినందించారు. అంతకుముందు పైలపేటలో రొంగలి ఎల్లయ్య నివాసానికి వెళ్లి పింఛను అందజేశారు.
