ముఖ్యమంత్రి బస్సులకు భద్రతేదీ?
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:53 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపయోగించే బస్సుల పట్ల ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రూ.కోట్ల విలువైన బస్సులను విజయవాడ డిపోలో...
విజయవాడ డిపోలో చెట్లకిందే పార్కింగ్
రూ.కోట్ల విలువైన బస్సులపై ఆర్టీసీ నిర్లక్ష్యం
విజయవాడ, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపయోగించే బస్సుల పట్ల ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రూ.కోట్ల విలువైన బస్సులను విజయవాడ డిపోలో ఓ మూలన చెట్ల కింద ఉంచటంపై విమర్శలు వస్తున్నాయి. డిపో ఆవరణలో సాధారణ బస్సులు పార్కింగ్ చేసే చోటే వీటిని కూడా పార్క్ చేశారు. దీంతో ఇవి ఎండకు ఎండి.. వానకు తడుస్తున్నాయి. అంతేకాదు.. గత వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. నాటి ప్రమాదంలో ఖరీదైన గరుడ బస్సులు కాలి బూడిదయ్యాయి. రూ.కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన సీఎం బస్సులను కూడా అక్కడే వదిలేస్తుండడంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనల కోసం కొనుగోలు చేసిన బస్సులను గతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో ఉంచేవారు. వీటి పర్యవేక్షణకు ఆర్టీసీ ఉద్యోగులకు డ్యూటీలు వేసేవారు. సెక్యూరిటీ కూడా ఉండేది. ప్రస్తుతం ఇలాంటివేమీ లేవు. వాహనాల భద్రత రీత్యా వీటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పలువురు కోరుతున్నారు.