బీజేపీలో వర్గపోరు
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:15 PM
శ్రీశైల నియోజకవర్గం కేంద్ర బిందువైన ఆత్మకూరు బీజేపీలో మరోసారి వర్గపోరు రచ్చకెక్కింది.
జిల్లా అధ్యక్షుడి సాక్షిగా బహిర్గతం
త్వరలో సమన్వయం చేసేందుకు కసరత్తు
ఆత్మకూరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): శ్రీశైల నియోజకవర్గం కేంద్ర బిందువైన ఆత్మకూరు బీజేపీలో మరోసారి వర్గపోరు రచ్చకెక్కింది. ఇటీవల దోర్నాల వద్ద జరిగిన ఓరోడ్డు ప్రమాదంలో బీజేపీ ఆత్మకూరు మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వెంకట రామిరెడ్డి మృతిచెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను బీజేపీ జిల్లా అధ్య క్షుడు అభిరుచి మధు పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ పర్యటనలో తొలుత ఆయన ఆపార్టీ జాతీయ మైనార్టీ మహిళా మోర్చా సభ్యురాలు మోమిన షబానా ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడికి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మల్లెల కృష్ణారెడ్డి, విశ్వరూపాచారి, మౌళీబాషతో పాటు ఇతర పలువురు నాయకులు వెళ్లలేదు. వీరందరు ప్రత్యేకంగా ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహంలో అభిరుచి మధును కలిశారు. ఈక్రమంలోనే పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి ఆయన దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకు స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో సమన్వయ లోపం ఉందన్న మాట వాస్తవమేనని రెండు, మూడు రోజుల్లో అందరితో సంప్రదించి నియోజకవర్గ స్థాయి కార్యాలయ ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ పార్టీ సిద్దాంతం ప్రకారం ఎవరికి నియోజకవర్గ కన్వీనర్, ఇనచార్జ్ బాధ్యతలు ఉండవని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ కన్వీనర్ బాధ్యతలు ఉంటా యని గుర్తుచేశారు. ఎవరైనా సరే సీనియర్ నాయకులకు గౌరవించాల్సిందేనని వివరిం చారు. త్వరలోనే అందరి ఆమోదంతో ఆత్మకూరు బీజేపీ మండల అధ్యక్షుడి నియా మకం చేపడతామని వెల్లడించారు. జనతా వారధి పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా వ్యవహరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.