కొంగొత్తగా టెన్త్ పరీక్షలు!
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:01 AM
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ప్రశ్నావళి శైలి మారనుంది. ప్రశ్నపత్రం రూపకల్పన విషయంలో ఇప్పటి వరకూ బ్లూమ్స్ టాక్సానమీ (వర్గీకరణ) అనే విధానం అమలు కాగా..
ఈ ఏడాది నుంచి మారనున్న ప్రశ్నావళి
ఎన్‌సీఈఆర్‌టీ ‘పరఖ్’ విధానంలోకి మార్పు
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేలా ప్రశ్నలు
పుస్తకాల్లో చదివిన పాఠాలే కాకుండా..
సొంతంగా ఆలోచించి రాసేలా రూపకల్పన
సృజనాత్మకత, సున్నితత్వం విభాగాలకు
20 శాతం చొప్పున వెయిటేజీ కేటాయింపు
అవగాహన విభాగంలో 60 శాతం ప్రశ్నలు
బ్లూప్రింట్ విడుదల చేసిన ఎస్‌ఎస్‌సీ బోర్డు
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ప్రశ్నావళి శైలి మారనుంది. ప్రశ్నపత్రం రూపకల్పన విషయంలో ఇప్పటి వరకూ బ్లూమ్స్ టాక్సానమీ (వర్గీకరణ) అనే విధానం అమలు కాగా.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దానిని ఎన్‌సీఈఆర్‌టీ పరిధిలోని ‘పరఖ్’ వర్గీకరణ విధానంలోకి మార్చారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేలా, పాఠ్యాంశాల్లో ఉండే అంశాలే కాకుండా, సొంతంగా ఆలోచించి సమాధానాలు రాసేలా పదో తరగతి పరీక్షల ప్రశ్నావళిలో మార్పులు ఉండనున్నాయి. ప్రశ్నలకు అవగాహన, సృజనాత్మకత, సున్నితత్వం ఆధారంగా జవాబులు రాసేలా వెయిటేజీ ఉంటుంది. ఈ ఏడాది నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన విధానంపై ఎస్‌ఎ్‌ససీ బోర్డు బ్లూప్రింట్లు విడుదల చేసింది. విద్యార్థులు కొత్త విధానంపై అవగాహన పెంచుకోవాలని సూచించింది. ఇప్పటి వరకూ ఉన్న విధానంలో విజ్ఞానం, అవగాహన, అన్వయం, సృజనాత్మకత, మూల్యాంకనం ఆధారంగా ప్రశ్నావళిని వర్గీకరించారు. ఇకపై అవగాహన, సృజనాత్మకత, సున్నితత్వం ఆధారంగా ప్రశ్నలను వర్గీకరణ చేస్తారు. అవగాహన విభాగంలో 60 శాతం ప్రశ్నలుంటాయి. ఇందులో విద్యార్థి విజ్ఞానం, అమలు విధానం, పాఠాల్లోని కాన్సె్‌ప్ట్‌ను అర్థం చేసుకోవడంపై ప్రశ్నలు ఇస్తారు. సున్నితత్వం విభాగంలో 20 శాతం ప్రశ్నలుంటాయి. ఇందులో భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించడం, సానుకూల దృక్పథంతో వివిధ అంశాలను అర్థం చేసుకోవడం, టీమ్ వర్క్ తరహా ప్రశ్నలుంటాయి. సృజనాత్మకత విభాగంలో 20 శాతం ప్రశ్నలుంటాయి. విజ్ఞానాన్ని నైపుణ్యం రూపంలోకి మార్చి ఎలా అమలు చేయాలి?, భాష స్పష్టత, కొత్త ఆలోచనలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు తరహా ప్రశ్నలుంటాయి.
విద్యార్థి ఆలోచనలకు తగ్గట్టుగా..
సున్నితత్వం, సృజనాత్మకత విభాగాల్లో ఎక్కువగా ఓపెన్ మైండెడ్ ప్రశ్నలు ఇస్తారు. అంటే ఆ ప్రశ్నలు పాఠ్యాంశాల ఆధారంగానే ఇచ్చినా... ఫలానా ప్రశ్నకు ఒకే విధంగా సమాధానం రాయాలని కాకుండా, విద్యార్థి ఆలోచనకు తగ్గట్టుగా నచ్చిన రీతిలో సమాధానం రాసుకోవచ్చు. దీనివల్ల విద్యార్థుల్లో విభిన్న ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఎక్కువగా పాఠ్యపుస్తకంలో ఉన్న దానినే యథావిధిగా రాస్తే మార్కులు పడుతున్నాయి. ఇకపై అలా కాకుండా విద్యార్థి పాఠ్యాంశాన్ని అర్థం చేసుకుని, దానిని సొంత అభిప్రాయాలను కూడా జోడించే విధానం అమల్లోకి రానుంది. ఇంగ్లి్‌ష్‌లో మాత్రం అవగాహనకు 65 శాతం, సున్నితత్వానికి 15 శాతం వెయిటేజీ ఇచ్చారు. అన్ని సబ్జెక్టుల్లో... సులభతర ప్రశ్నలు 25 నుంచి 30 శాతం, క్లిష్టమైన ప్రశ్నలు 20 శాతం, మోస్తరు ప్రశ్నలు 50 శాతం ఇవ్వనున్నారు. సోషల్ స్టడీస్‌లో కొత్తగా కొన్ని ప్రశ్నలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంటి పనులు చేయడంలో లింగ అసమానత్వంపై ప్రశ్నలు రూపొందించనున్నారు. బ్లూప్రింట్ ప్రశ్నాపత్రంలో ‘ఇంటి పనులు లింగ అసమానతను ఎలా చూపిస్తాయో రెండు ఉదాహరణలతో నిరూపించండి’ అనే ప్రశ్న ఉంది. అలాగే సమాజంపై అవగాహన కోసం ‘మీరు ఒక జర్నలిస్ట్ అయితే.. సుస్థిరాభివృద్ధి ప్రాముఖ్యతపై వ్యాసం రాయడానికి ఏయే ముఖ్యాంశాలను చేరుస్తారు?’ అనే ప్రశ్న ఉంది. బయాలజీలో ‘రవి, రాజు స్నేహితులు. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. రవి తనకు ధూమపానం ఉపశమనం కల్పిస్తుందని భావిస్తుండగా, యోగా చేయడం మంచిదని రాజు అన్నారు. వీరిలో ఎవరు తప్పుగా ఆలోచిస్తున్నారు? అతను వాస్తవాన్ని తెలుసుకునేలా నువ్వు ఎలాంటి అవగాహన కల్పిస్తావు?’ అనే ప్రశ్న ఇచ్చారు. ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రసంగానికి స్ర్కిప్టు రూపొందించడం, అధికారిక-అనధికారిక లేఖలు రాయడంపై తదితర ప్రశ్నలు ఇచ్చారు. మొత్తంగా విద్యార్థి పాఠ్యాంశాలను అర్థం చేసుకుని, సొంతంగా ఆలోచించే రాసే ప్రశ్నలను తీసుకొస్తున్నారు.