Share News

కొత్త లేబర్‌ కోడ్‌లపై అపోహలు వద్దు

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:58 AM

గత ఏడాది నవంబరు 21న కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన కొత్త కార్మిక చట్టాల (లేబర్‌ కోడ్‌లు)పై అపోహలు వద్దని కేంద్ర ఎంఎస్ఎంఈ, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే చెప్పారు.

కొత్త లేబర్‌ కోడ్‌లపై అపోహలు వద్దు

  • కార్మికుల జీవితాల్లో మార్పు కోసమే సంస్కరణలు

  • కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల సహాయమంత్రి కరంద్లాజే

  • పురుషులతో సమానంగా మహిళలకు ప్రాధాన్యం: మంత్రి సుభాష్‌

అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది నవంబరు 21న కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన కొత్త కార్మిక చట్టాల (లేబర్‌ కోడ్‌లు)పై అపోహలు వద్దని కేంద్ర ఎంఎస్ఎంఈ, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే చెప్పారు. ఈ చట్టాలు అటు కార్మికులు, ఇటు యజమానుల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకురానున్నాయని అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉపాధి అవకాశాల పెంపు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడమే కొత్త చట్టాల లక్ష్యమన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన దక్షిణ భారత ప్రాంతీయ కార్మిక సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభా్‌షతో కలిసి మీడియాతో మాట్లాడారు. కొత్త చట్టాల పట్ల కార్మికులకు అవగాహన కల్పించేందుకు ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు.


గోవా, జైపూర్‌ తర్వాత మూడో ప్రాంతీయ సదస్సును విజయవాడలో నిర్వహించామన్నారు. కొత్త చట్టాల ద్వారా కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? అసంఘటిత రంగంలోని 90 శాతం కార్మికులకు ఈపీఎ్‌ఫవో, ఈఎస్ఐ సౌకర్యాలను ఏవిధంగా అందించాలి? అనే అంశంపై ప్రాంతీయ సదస్సుల్లో చర్చిస్తున్నామని తెలిపారు. కొత్త చట్టాలతో మహిళలకు సమాన పనికి, సమాన వేతనం లభిస్తుందన్నారు. రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయిల్లో కొత్త చట్టాలను సమర్థంగా అమలు చేయడంపై అధికారులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి శుభాష్‌ మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళా కార్మికులకు వేతనాలు అందించడం, పని ప్రదేశం నుంచి ఇంటి వద్దకు (డోర్‌స్టెప్‌) వారిని భద్రంగా చేర్చడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో 50 సీట్లతో ఈఎ్‌సఐ మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నెల్లూరు, శ్రీసిటీ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈఎ్‌సఐ ఆసుపత్రుల కోసం భూముల కేటాయించనున్నట్లు చెప్పారు. విజయనగరంలో ఈఎ్‌సఐ ఆసుపత్రి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. పని ప్రదేశాల్లోనే వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి కార్మికులకు షుగర్‌, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడం ద్వారా తగిన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Jan 28 , 2026 | 04:58 AM