Share News

భారత డీఎన్‌ఏలోనే మధ్యవర్తిత్వం!

ABN , Publish Date - Mar 02 , 2026 | 03:10 AM

భారతదేశ డీఎన్‌ఏలోనే మధ్యవర్తిత్వం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టంచేశారు.

భారత డీఎన్‌ఏలోనే మధ్యవర్తిత్వం!

  • నాడు భారతంలో శ్రీకృష్ణుడు మధ్యవర్తి: జస్టిస్‌ సూర్యకాంత్‌

  • ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ప్రక్రియ

  • మధ్యవర్తిత్వానికి అమరావతి

  • భూసమీకరణ పెద్ద ఉదాహరణ

  • న్యాయవ్యవస్థ కూడా దానిని ప్రోత్సహించాలి

  • మలేసియాలో బాగా వినియోగిస్తున్నారు

  • ప్రతి సమస్యకూ కోర్టుకెళ్లడం పరిష్కారం కాదు

  • విజయవాడలో మీడియేషన్‌ సదస్సులో సీజేఐ

  • రాజధానిలోని జస్టిస్‌ సిటీలో జ్యుడీషియల్‌

  • అకాడమీ, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ,

  • మీడియేషన్‌ సెంటర్‌, ఇంటర్నేషనల్‌ వర్సిటీ

  • వీటికి భూములివ్వడానికి సిద్ధం: ముఖ్యమంత్రి

అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): భారతదేశ డీఎన్‌ఏలోనే మధ్యవర్తిత్వం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టంచేశారు. మహాభారతంలో రెండు వర్గాల మధ్య సంధి కుదిర్చేందుకు శ్రీకృష్ణుడు మధ్యవర్తిగా వ్యవహరించాడని.. కానీ విఫలమయ్యాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయసేవా సంస్థ నేతృత్వంలో ఆదివారం విజయవాడలో మధ్యవర్తిత్వంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. కోర్టుల వల్ల కుటుంబ సమస్యలు, ఇతరత్రా సమస్యలు కొంత వేగంగా పరిష్కారం అవుతున్నప్పటికీ.. తెగని చాలా సమస్యలకు మధ్యవర్తిత్వం ఎంతో ఉపయుక్తంగా ఉందని జస్టిస్‌ సూర్యకాంత్‌ తెలిపారు. ప్రతి సమస్యకూ కోర్టుకు వెళ్లడంతో పరిష్కారం కాదని, కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు ఎక్కువవుతున్నాయని తెలిపారు. మొదట ఇరుపక్షాలూ మధ్యవర్తిపై నమ్మకం ఉంచితేనే సత్ఫలితాలొస్తాయన్నారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మధ్యవర్తిత్వం ప్రస్తుత కాలంలో ఆమోదించిన ప్రక్రియగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ కూడా దీనిని ప్రోత్సహించాలన్నారు. తాను మలేసియా చీఫ్‌ జస్టి స్‌ను కలిసినప్పుడు వారు మధ్యవర్తిత్వాన్ని ఎంత బాగా వినియోగించుకుంటున్నారో అర్థమైందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం భూసమీకరణ కోసం రైతులతో జరిపిన చర్చల ఫలితమే రాజధాని అమరావతి అని, మధ్యవర్తిత్వానికి ఇదో ఉదాహరణగా అభివర్ణించారు.


విశాఖ సదస్సుకు సీఎం సహకరించారు: సీజే

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. విశాఖలో జరిగిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సుకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. జమ్మూకశ్మీర్లో తాను న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. అమెరికాలో స్థిరపడిన ఓ వ్యక్తి వారసత్వ ఆస్తి గురించి తనను ఓ న్యాయవాది సంప్రదించారని.. అప్పుడు వారి సోదరుడితో ఎందుకు మాట్లాడకూడదని అడిగానని.. ఆరు నెలల తర్వాత ఆయన కనిపించి తన కుటుం బం, సోదరుడి కుటుం బం కలిసిపోయాయని, దూరం చేసుకోలేదని చెప్పారని.. మధ్యవర్తిత్వానికి ఉన్న శక్తి అలాంటిదని అన్నారు. మధ్యవర్తిత్వం విజయవంతమైతే రూ.10వేలు, కాకపోతే రూ.3 వేలు ఇన్సెంటివ్‌గా చెల్లించేందుకు సీఎం అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


దేశంలోనే బెస్ట్‌ మోడల్‌గా: సీఎం

అమరావతిలో జాతీయ జ్యుడీషియల్‌ అకాడమీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భారత ప్రధాన న్యాయమూర్తిని ఈ సందర్భంగా కోరారు. ‘రాజధాని నిర్మాణంలో భాగంగా జస్టిస్‌ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. జ్యుడీషియల్‌ అకాడమీ, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, మీడియేషన్‌ సెంటర్‌, ఇంటర్నేషనల్‌ లా యూనివర్సిటీ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వంటి వాటితో ఈ సిటీని నిర్మిస్తాం. వీటికి అవసరమైన భూములివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అమరావతి జస్టిస్‌ సిటీని దేశంలోనే బెస్ట్‌ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి భారత ప్రధాన న్యాయమూర్తి సహకారం కావాలి’ అని అన్నారు. తన చిన్నతనంలో తన తండ్రి తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల 40 గ్రామాలకు సంబంధించి మధ్యవర్తిత్వం చేసేవారని, ఇది మన సంప్రదాయంలోనే ఉందని అన్నారు. ‘ప్రపంచంలో అత్యంత ప్రధానమైన మధ్యవర్తిత్వ కార్యక్రమం అమరావతిలో 2014-19 మధ్య కాలంలో జరిగింది. 29 వేల మంది రైతులతో మధ్యవర్తిత్వం నెరపి.. 33 వేల ఎకరాలను భూసమీకరణ (ల్యాండ్‌పూలింగ్‌) ద్వారా సేకరించాం’ అని వివరించారు. మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే రూ.10 వేలు.. పరిష్కారం కానున్నా రూ.3వేలు ఇన్సెంటివ్‌గా ఇస్తామని హామీ ఇచ్చారు. కేసులు పరిష్కారమై సత్వర న్యాయం అందితే.. త్వరితగతిన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ‘దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని నిర్మాణం చేపడుతున్నాం. బ్లూ-గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా, పర్యావరణహితంగా, ఆర్థికంగా బలమైన రాజధానిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం’ అని తెలిపారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్టి, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, పలువురు న్యాయమూర్తులు, జిల్లా మేజిస్ట్రేట్‌లు, న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సను సత్కరించి జ్ఞాపికలు అందించారు. రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కూడా అతిఽథులను సన్మానించింది.

Updated Date - Mar 02 , 2026 | 03:13 AM