Share News

అమరావతిలో బిజీబిజీగా సీజేఐ పర్యటన

ABN , Publish Date - Mar 02 , 2026 | 03:26 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ రాజధాని అమరావతిలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ, హైకోర్టు అతిథిగృహం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

అమరావతిలో బిజీబిజీగా సీజేఐ పర్యటన

  • జ్యుడీషియల్‌ అకాడమీకి శంకుస్థాపన చేసిన జస్టిస్‌ సూర్యకాంత్‌

  • హైకోర్టు అతిథిగృహ నిర్మాణానికీ భూమిపూజ

  • న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయం ప్రారంభం

  • పాల్గొన్న సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు సీజే

అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ రాజధాని అమరావతిలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ, హైకోర్టు అతిథిగృహం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే నూతనంగా నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయం(రెసిడెన్సియల్‌ ఎన్‌క్లేవ్‌)ను ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం తిరుపతి నుంచి విజయవాడకు చేరుకున్న సీజేఐ విమానాశ్రయం నుంచి నేరుగా రాజధాని అమరావతికి చేరుకున్నారు. తుళ్లూరు మండలం, పిచ్చుకల పాలెం గ్రామంలో అధునాతన హంగులతో నిర్మించనున్న రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ భవనానికి శంకుస్థాపన చేశారు. భూమిపూజ నిర్వహించి, పునాది రాయి వేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీ బట్టి, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీజేఐ, ఇతర న్యాయమూర్తులకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ.. సీఎం చంద్రబాబు, ఇతర న్యాయమూర్తులతో కలిసి జ్యుడీషియల్‌ అకాడమీ, రాజధాని అమరావతి అభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు.


అనంతరం అక్కడి నుంచి నేలపాడులోని హైకోర్టు సమీపంలో కొత్తగా నిర్మించిన న్యాయమూర్తుల గృహ సముదాయం వద్దకు సీజేఐ చేరుకున్నారు. అక్కడ హైకోర్టు అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూమిపూజ నిర్వహించి, పునాది రాయి వేశారు. అనంతరం అధునాతన హంగులతో నిర్మించిన న్యాయమూర్తుల నివాస సముదాయాన్ని సీజేఐ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు, సాధారణ పరిపాలన, పురపాలకశాఖల ముఖ్యకార్యదర్శులు శ్యామలరావు, సురేష్ కుమార్, జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ పురుషోత్తమ్‌కుమార్‌, అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) కనకమేడల రవీంద్ర కుమార్‌, హైకోర్టు రిజిస్ట్రార్‌లు, పలువురు న్యాయాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 05:53 AM