న్యాయం త్వరగా అందాలి!
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:15 AM
ప్రజలకు న్యాయస్థానాలు అందుబాటులో ఉండాలని.. అదే సమయంలో న్యాయం త్వరగా అందాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు.
ప్రజలకు కోర్టులు అందుబాటులో ఉండాలి: జస్టిస్ సూర్యకాంత్
బార్, బెంచ్.. కోర్టుకు రెండు చేతులు.. పరస్పర సమన్వయంతో సాగాలి
న్యాయస్థానాలకు మౌలిక వసతుల కల్పన ప్రధాన సమస్య
50 ఏళ్లు, వందేళ్ల అవసరాలకు సరిపడా సదుపాయాలు కల్పించాలి
రాష్ట్రాలకు సీజేఐ వినతి.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ సహకారం భేష్
115 కోట్లతో తిరుపతిలో కోర్టు కాంప్లెక్స్‌కు శంకుస్థాపన
అంతకుముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ప్రజలకు న్యాయస్థానాలు అందుబాటులో ఉండాలని.. అదే సమయంలో న్యాయం త్వరగా అందాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు. ఆదివారం తిరుపతిలోని దామినీడులో ప్రభుత్వం కేటాయించిన 14.5ఎకరాల్లో రూ.115కోట్ల అంచనా వ్యయంతో 16 కోర్టు కార్యాలయాలతో కూడిన ఆరంతస్తుల భవన సముదాయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం తిరుపతి బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. భవన సదుపాయాలు, ఇతర ఆధునిక మౌలిక వసతుల కల్పన అనేది దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటని చెప్పారు. అయితే అవన్నీ సమకూర్చుకున్నాక ప్రజలకు సులువుగా న్యాయం అందించడమనే రెండో సవాల్‌ను కూడా న్యాయవ్యవస్థ ఎదుర్కొంటోందన్నారు. ‘తక్కువ ఖర్చుతో ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితులు నెలకొనాలి. అదే సమయంలో వారికి సత్వర న్యాయం అందించాల్సిన అవసరం కూడా ఉంది. న్యాయస్థానాల్లో బార్ అసోసియేషన్లు, బెంచ్‌లు వేర్వేరు కాదు. న్యాయ వ్యవస్థకు అవి రెండు చేతులు.
పరస్పర సమన్వయంతో, సహకారంతో పనిచేయాలి. ప్రజలకు న్యాయం అందించాల్సిన బాధ్యత కేవలం న్యాయమూర్తులదే అన్న అపోహ అందరిలో ఉంది. బలమైన న్యాయవాదులు ఉన్నప్పుడే ధర్మాసనం సైతం దానికి తగినట్లు జాగ్రత్తగా, లోతుగా ఆలోచించి తీర్పులు చెబుతుంది. దీనివల్ల తీర్పుల్లో నాణ్యత పెరుగుతుంది. ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం, గౌరవం పెంపొందుతాయి. న్యాయస్థానాలకు భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో భూమి ఎప్పుడూ పరిమితంగానే ఉంటుం ది. రాబోయే కాలంలో భూముల కొరత మరింత ఎక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే 50 ఏళ్లు, వందేళ్ల అవసరాలకు సరిపడే విధంగా భవనాలను, మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నాం’ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కోర్టులకు భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.

ఎక్కడి నుంచైనా న్యాయం అందించాలి: ఏపీ సీజే
జమ్మూకశ్మీరు న్యాయమూర్తులను స్ఫూర్తిగా తీసుకుని.. ఎక్కడి నుంచైనా ప్రజలకు న్యాయం అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయాధికారులకు, న్యాయవాదులకు పిలుపిచ్చారు. బార్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014-15లో జమ్మూకశ్మీర్లో వరదలు సంభవించాయని, ఆ వరదల్లో శ్రీనగర్‌లోని హైకోర్టు భవనం మొదటి అంతస్తు సగం దాకా మునిగిపోయిందని.. రికార్డులు కూడా కొట్టుకుపోయాయని తెలిపారు. అయితే అప్పటి న్యాయమూర్తులు తమ నివాసాలనే కార్యాలయాలుగా మార్చుకుని పనిచేశారని గుర్తు చేసుకున్నారు. తమ నివాస బంగళాల ఆవరణలో టెంట్లు వేసి మరీ కోర్టు నడిపారన్నారు. వారి తరహాలోనే వసతుల కోసం, మౌలిక సదుపాయాల కోసం చూడకుండా ఏ పరిస్థితుల్లోనైనా ప్రజలకు న్యాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కోర్టులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే నిస్సందేహంగా న్యాయవ్యవస్థ సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. 2023లో తాను రాష్ట్రానికి వచ్చాక వేసవి కాలంలో కోర్టుల్లో న్యాయమూర్తులు, అధికారులు ఇబ్బందులు పడడం గమనించానని.. అప్పుడే అన్ని జిల్లాల కోర్టు సముదాయాల్లో ఏసీ సదుపాయం కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ అహసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జయసూర్య, జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ కె.మహేశ్వరరావు, జస్టిస్ టీసీడీ శేఖర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి అరుణా సారిక, తిరుపతి బార్ అసోసియేషన్ అద్యక్షుడు గొట్టి గజేంద్ర, హైకోర్టు అధికారులు, జిల్లాలోని న్యాయాధికారులు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయడు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.
తిరుమలేశుడి సేవలో జస్టిస్ సూర్యకాంత్
తిరుమల, మార్చి 1(ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయ మర్యాదలతో ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన జస్టిస్ సూర్యకాంత్ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత చైర్మన్, ఈవో, అదనపు ఈవోలు సీజేఐకు శ్రీవారి లడ్డూప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. తర్వాత క్షేత్రసంప్రదాయం ప్రకారం వరాహస్వామిని కూడా దర్శించుకున్నారు. పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ హైకోర్టు సీజే, జడ్జీలతోపాటు అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ అరుణ్ భన్సాలీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.జయచంద్ర, రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రశేఖర్ శర్మ, జస్టిస్ బిపిన్ గుప్తా, జస్టిస్ యోగేంద్ర కుమార్ పురోహిత్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మంజూషా దేశ్‌పాండే, లోకాయుక్త బీఎస్ పాటిల్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.