నేడు అమరావతికి సీజేఐ
ABN , Publish Date - Mar 01 , 2026 | 05:40 AM
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న జస్టిస్ సూర్యకాంత్
జ్యుడీషియల్ అకాడమీ, అతిథి గృహానికి శంకుస్థాపన
న్యాయమూర్తుల నివాస సముదాయం ప్రారంభం
తిరుపతి(కలెక్టరేట్)/తుళ్లూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన శనివారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంటలోని విమానాశ్రయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు సీజేఐకు స్వాగ తం పలికారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని సీజేఐ దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి కలెక్టరేట్ సమీపంలోని దామినేడు వద్ద ఉదయం 10 గంటలకు జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. ఈ ఏర్పాట్లను శనివారం హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఽధీరజ్‌సింగ్ ఠాకూర్ పరిశీలించారు. తిరుపతిలో పర్యటన అనంతరం సీజేఐ రాజధాని అమరావతికి బయలుదేరుతారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అమరావతిలో సీజేఐ పర్యటన ఇలా..
జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం మధ్యాహ్నం 3.30 సమయంలో అమరావతి రాజధానికి చేరుకుంటారు. పిచ్చుకలపాలెంలో నిర్మించనున్న ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంతం వద్ద సీఎం చంద్రబాబు ఆయనకు స్వాగతం పలుకుతారు. 3.35 నుంచి 3.55 గంటల వరకు భూమిపూజ, శిలాఫలకం ఆవిష్కరణ, సైట్‌ప్లాన్స్‌ని పరిశీలిస్తారు. సాయంత్రం 4.05 గంటల నుంచి 4.25 గంటల వరకు నేలపాడులో ఏపీ హైకోర్టు అతిథిగృహం నిర్మాణానికి భూమిపూజ, శిలాఫలకం ఆవిష్కరణలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు నేలపాడులో నూతనంగా నిర్మించిన హైకోర్టు జడ్జీల నివాస సముదాయంని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు లోక్‌భవన్‌లో గవర్నర్ నివాసానికి వెళతారు. తర్వాత దక్షిణ భారత్‌లోనే తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మీడియేషన్‌పై విజయవాడలో జరగనున్న సింపోజియంలో జస్టిస్ సూర్యకాంత్ పాల్గొంటారు.
జీప్లస్ 3గా అతిథి గృహం
రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల గెస్ట్ హౌస్, క్లబ్ 6,300 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణం జరగనుండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 69 కోట్లు మంజూరైంది. మొత్తం సైట్‌లోని భూమిలో 20 శాతం మాత్రమే భవన నిర్మాణానికి కేటాయించి, మిగతా 80 శాతం పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ ప్లాన్ రూపొందించారు. విశాలమైన రహదారితో హైకోర్టు భవనాన్ని ఈ అతిథి గృహానికి అనుసంధానించారు. జీ ప్లస్3తో నిర్మించే ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్, పురుషులు, మహిళల కోసం ప్రత్యేక స్పా సదుపాయాలు, లాంజ్ ఏర్పాటు చేస్తారు. మొదటి అంతస్తులో జిమ్ యోగా, ఏరోబిక్స్ హాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, ఫంక్షన్ హాల్‌తో కూడిన మల్టీపర్పస్ మాల్ నిర్మించనున్నారు. రెండో అంతస్తులో 6 ప్రీమయం సూట్ గదులు, 2 డీలక్స్ గదులు ఉంటాయి. మూడో అంతస్తులో 4 ప్రీమియం సూట్ గదులు, 1 ప్రెసిడెన్షియల్ సూట్, 1 డీలక్స్ గదితోపాటు మొత్తంగా 15 గదులు న్యాయమూర్తుల అవసరాలకు కోసం నిర్మిస్తారు.