Share News

సివిల్‌ ఏవియేషన్‌లోనూఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:45 AM

సివిల్‌ ఏవియేషన్‌లోనూ తిరుమల తరహా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

సివిల్‌ ఏవియేషన్‌లోనూఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

  • తిరుమల తరహాలోనే ఏర్పాటు చేస్తాం

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

తిరుమల/తిరుపతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): సివిల్‌ ఏవియేషన్‌లోనూ తిరుమల తరహా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. తిరుమల శ్రీవారిని శనివారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలసి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లోని ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించారు. తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘తిరుమలలో ఇటీవల ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించాం. మేం కూడా సివిల్‌ ఏవియేషన్‌లో ఇటువంటి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నాం. మాకు ఎంతో ఉపయోగపడేలా బ్రహ్మాండంగా తిరుమలలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసిన టీటీడీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సెంటర్‌ను ఏర్పాటు చేయాలంటే చాలా ఏళ్లు పడుతుంది. కొంతమంది ఎన్‌ఆర్‌ఐ భక్తులు కలసి తిరుమలలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుత ఏఐ టెక్నాలజీని వినియోగించుకుని మంచి సౌకర్యాలతో భక్తులకు తక్కువ సమయంలోనే దర్శనం చేయించేలా ఈ సెంటర్‌ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. దీనికోసం పనిచేసిన బృందంతో త్వరలోనే సమావేశమవుతాం’ అని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ‘దేశంలో విమానాశ్రయాలు, ఏవియేషన్‌ సెక్టార్‌ ఎంతటి అభివృద్ధి సాధించాయో అందరూ చూస్తునే ఉన్నారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే నేడు ఆ సంఖ్య సుమారు 165 చేరింది. రానున్న 20 ఏళ్లలో ప్రతి ఏడాది 10ు గ్రోత్‌ రేట్‌తో ఈ సెక్టార్‌ ముందుకు వెళుతుంది. ఇలాంటి సమయంలో ఆపరేషన్స్‌, ప్రయాణికుల సౌకర్యాలు, విమానాశ్రయాల కార్యకలాపాలను తిరుమలలోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఆపరేట్‌ చేయగలిగితే ప్రయాణికులకు మంచి సౌకర్యాలు అందుతాయి. దర్శనం, ప్రసాదాలు ఇతర సౌకర్యాలను చాలామంది భక్తులు మెచ్చుకుంటున్నారు. దీనిపై సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


తిరుపతి విమానాశ్రయం నుంచి త్వరలో అంతర్జాతీయ సర్వీసులు

తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ ఏడాదిలోపు ప్రారంభమవుతాయని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. తిరుపతిలోని అమరరాజ ఆడిటోరియం లో కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (కెకా) స్వర్ణోత్సవ వేడుక శనివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ‘తిరుపతి విమానాశ్రయం నుంచి గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇప్పటివరకు ఇదే పెద్ద సంఖ్య. తిరుపతి నుంచి వారణాసి, అయోధ్యలకు విమానాలను నడపనున్నాం’ అని కేంద్ర మంత్రి ప్రకటించారు. తిరుపతి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు చేసిన అభ్యర్థనపై స్పదిస్తూ... త్వరలోనే కోయంబత్తూరుకు విమాన సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మురళీమోహన్‌, అమరరాజ సంస్థల అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్‌, కెకా అధ్యక్షురాలు రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 04:45 AM