సీఐడీ ఆఫీసులో.. ఆరోజు ఏం జరిగింది?
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:44 AM
ఆ రోజు సీఐడీ కార్యాలయంలో ఏం జరిగింది.. 2021 మే 14న హైదరాబాద్‌లో జన్మదిన వేడుకలు జరుపుకొంటున్న నాటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు సీఐడీ కార్యాలయానికి...
రఘురామను ఏ టైంలో తీసుకొచ్చారు?
సునీల్ నాయక్‌ను ప్రశ్నించిన పోలీసులు
అప్పుడక్కడ ఎవరెవరు ఉన్నారు?
రఘురామను ఎక్కడ కూర్చోబెట్టారు?
ఆ నలుగురు ముసుగు మనుషులెవరు?
ఆయన కాళ్లకు గాయాలెలా తగిలాయ్?
దర్యాప్తు అధికారి దామోదర్ ప్రశ్నలు
కస్టోడియల్ టార్చర్ ఘటన రీకన్‌స్ట్రక్షన్
ఎల్లుండి వరకు విచారణాధికారి ముందు హాజరవ్వండి
ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టు ఆదేశం
గుంటూరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఆ రోజు సీఐడీ కార్యాలయంలో ఏం జరిగింది.. 2021 మే 14న హైదరాబాద్‌లో జన్మదిన వేడుకలు జరుపుకొంటున్న నాటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించినప్పటి నుంచి తర్వాతి రోజు సాయంత్రం గుంటూరు కోర్టులో ఆయన్ను హాజరుపరిచే వరకు ఏం జరిగిందో దర్యాప్తు అధికారి సోమవారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుడైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్(ఏ-7)ను గుంటూరు సీసీఎస్ స్టేషన్ నుంచి సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. సునీల్ నాయక్ వరుసగా ఐదో రోజు కూడా దర్యాప్తు అధికారిగా ఉన్న విజయనగరం ఎస్‌పీ ఏఆర్ దామోదర్ ఎదుట హాజరయ్యారు. మధ్యాహ్నం ఆయన్ను సీసీఎస్ స్టేషన్ నుంచి సమీపంలోని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశాక మళ్లీ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ‘2021 మే 14న రాత్రి 11:30 గంటలకు రఘురామరాజును సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు.
అప్పుడక్కడ ఏం జరిగింది? మీరేం చేశారు, విచారణ ఎలా సాగిందో చేసి చూపించండి’ అని ఆయన్ను అడిగారు. రఘురామరాజును ఎన్ని గంటలకు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు.. ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు.. వారంతా ఎక్కడ కూర్చున్నారు.. రఘురామ ఎక్కడ కూర్చున్నారు..? ఆయనకు మీరు ఎంత దూరాన ఉన్నారు.. ఆ టైంలో అక్కడ ఇంకా ఎవరు ఉన్నారు..? మీరు మధ్యలో బయటకు వెళ్లారా.. వెళ్తే ఏ సమయంలో.. ఎక్కడకు వెళ్లారు? అసలు మిమ్మల్ని ఎవరు పంపారు..? ఆరోజు రాత్రి నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి రఘురామపై హత్యాయత్నానికి పాల్పడ్డారనేందుకు ఆధారాలు ఉన్నాయి. వారెవరు.. వారిని ఎవరు పంపించారు..? నాడు రఘురామ విచారణంతా పూర్తిగా మీ కనుసన్నల్లోనే జరిగింది. అటువంటప్పుడు వాస్తవాలు ఎందుకు దాస్తున్నారు..? ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు..? హైదరాబాద్‌లో రఘురామను మీరు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయన బాగానే ఉన్నారని చెబుతున్నారు.. మరి ఆయన కాలికి గాయాలెలా అయ్యాయి..’ అని ప్రశ్నించారు.
ఎల్లుండి వరకు విచారణాధికారి ముందు హాజరవ్వండి
రఘురామరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో దర్యాప్తు అధికారి ముందు ఈ నెల 12వ తేదీ వరకు హాజరు కావాలని సునీల్‌కుమార్ నాయక్‌ను హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టంచేసింది. పిటిషన్‌పై విచారణను గురువారానికి వాయిదావేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి సోమవారం ఉత్తర్వులిచ్చారు. పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. నాయక్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ‘ఆయన్ను ఇప్పటికే పట్నాలో అరెస్టు చేశాం. అరెస్టయ్యాక ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు, దానిపై విచారణ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అరెస్టు సమయంలో చట్టనిబంధనలు పాటించాం. కారణాలను పిటిషనర్‌కు రాతపూర్వకంగా అందజేశాం. వాటిపై ఆయన సంతకం కూడా చేశారు. అరెస్టు గురించి కుటుంబ సభ్యులకు తెలియపరిచాం. స్థానిక పోలీసుస్టేషన్‌లో కూడా సమాచారం ఇచ్చాం. ఒకసారి అరెస్టయ్యాక రెగ్యులర్ బెయిల్ దాఖలు చేసుకోవాలి తప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడానికి వీల్లేదు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయండి’ అని కోరారు. నాయక్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నాయక్ దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారని.. కేసు విచారణకు సహకరించారని.. విచారణార్హతపై వాదనలు వినిపించడంతోపాటు వాటిని రాతపూర్వకంగా అందజేసేందుకు సమయం కోరారు.