మళ్లీ వీఆర్‌కు సీఐ రవికుమార్
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:16 AM
పాపం పండింది. డ్రైవర్ హత్య కేసు నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో అంటకాగిన కాకినాడ జిల్లా సర్పవరం ఇన్‌చార్జి సీఐ రవికుమార్‌పై..
కాకినాడ, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : పాపం పండింది. డ్రైవర్ హత్య కేసు నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో అంటకాగిన కాకినాడ జిల్లా సర్పవరం ఇన్‌చార్జి సీఐ రవికుమార్‌పై ప్రభుత్వం చర్య తీసుకుంది. వీరిద్దరి సాన్నిహిత్యంపై ‘దోస్త్ మేరా దోస్త్’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ గురువారం సంచికలో వచ్చిన కథనం తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసుశాఖలో ప్రకంపనలు రేపింది. అనంతబాబుతో సీఐ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం, కేసు విచారణకు సంబంధించిన కీలక సమాచారం అనంతబాబు భార్య (ఏ2)కు చేర్చడం వంటి అంశాలు ఆ కథనంతో వెలుగులోకి వచ్చాయి. అనంతబాబు తన మనుషుల ద్వారా సాక్షులను బెదిరించి, వ్యతిరేక సాక్ష్యం చెప్పకుండా వారికి నగదు కూడా ఇచ్చారు. సాక్షులు ఇచ్చిన ఫిర్యాదుతో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయాలని నిర్ణయించారు. ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లేలోగానే అనంతబాబుకు సమాచారం లీకవడంతో పారిపోయారు. వీటన్నింటినీ ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం సీఐను వీఆర్‌కు పంపింది. కాగా, హత్యకేసు, అనంతబాబు కోసం జరుగుతున్న గాలింపు పర్యవేక్షణ బాధ్యతను తునిరూరల్‌సీఐ చెన్నకేశవరావుకు అప్పగించింది.